![Soli Sorabjee Former Attorney General Dies Of Corona - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/30/8.jpg.webp?itok=cJMJOzEd)
న్యూఢిల్లీ: భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ శుక్రవారం ఉదయం కోవిడ్‌తో మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. దేశంలోనే సీనియర్ న్యాయవాది మాత్రమే కాక అత్యుత్తమ న్యాయవాదులలో సోలి సొరాబ్జీ ఒకరు. ఆయన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2002లో ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఇటీవల సొరాబ్జీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు.
ఆయన పూర్తి పేరు సోలి జెహంగీర్ సొరాబ్జీ. 1930 ముంబైలో జన్మించారు. 1953 లో ముంబై హైకోర్టులో తన న్యాయవాద ప్రాక్టీసును ప్రారంభించారు. 1971 లో ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సొరాబ్జీ మొదట సారిగా 1989 లో భారతదేశానికి అటార్నీ జనరల్ నియమితులయ్యారు. ఆ తరువాత రెండో సారి 1998 నుంచి 2004 వరకు సేవలు అందించారు. మానవ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన న్యాయవాది సొరాబ్జీ. హక్కుల రక్షణకై యూఎన్ ఉప కమిషన్‌లో ఆయన పని చేశారు. 1998 నుంచి 2004 వరకు దానికి ఛైర్మన్‌గా ఉన్నారు. వివక్ష, మైనారిటీల రక్షణపై యూఎన్‌లో ఉప కమిషన్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. 2002 లో, సొరాబ్జీ భారత రాజ్యాంగం సమీక్షించే కమీషన్‌లో సభ్యుడిగా కూడా పని చేశారు. ఆయన 1997 లో నైజీరియాలో యూఎన్ ప్రత్యేక రిపోర్టర్‌గా పని చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం
ప్రముఖ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సొరాబ్జీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సొరాబ్జీ వాదనలు మానవ హక్కుల పరిరక్షణపై తీవ్ర ప్రభావం చూపాయని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు.
( చదవండి: నెగటివ్: కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధానమంత్రి )
Comments
Please login to add a commentAdd a comment