కాంతిమతి వద్ద విచారిస్తున్న పోలీసు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తొమ్మిది నెలలు మోసి, పాలిచ్చి పెంచిన తల్లి..కుమారులకు భారమైంది. రెండు కాళ్లు కదపలేక వృద్ధాప్యంతో బాధపడుతున్న తల్లిపై ఏ మాత్రం కనికరం చూపకుండా ముళ్లపొదల్లో పారవేసి వదిలించుకున్నారు. మనసున్న కొందరు మహిళలు ఆ మార్గంలో వెళుతూ గమనించి ఆదుకోగా ప్రభుత్వ ఆస్పత్రిలో అనాథలా గడుపుతోంది. వివరాలు.. తిరుళ్లూరు జిల్లా పొన్నేరి సమీపం కున్నమంజేరి గ్రామానికి చెందిన కొందరు మహిళలు సమీపంలోని చెరువుకు వెళుతుండగా మార్గమధ్యంలోని ముళ్లపొదల నుంచి మహిళ ఏడుపులు, మూలుగుల శబ్దం వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా రెండు కాళ్లు అచేతన స్థితిలో సుమారు 80 ఏళ్ల వృద్ధురాలు పడిఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వారంతా కలిసి వృద్ధురాలిని ముళ్లపొదల్లో నుంచి మోసుకొచ్చి పోలీసుల సమాచారం ఇచ్చారు.
ఆమెను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మనలి చెక్కోడుకు చెందిన ఆ వృద్ధమహిళ కాంతిమతి పోలీసులకు తనగోడు చెప్పుకున్నారు. తనకు భర్త రాధాకృష్ణన్, రవి, శంకర్ అనే ఇద్దరు కుమారులున్నారు. కుమారులిద్దరూ కూలీపనులకు వెళుతుంటారు. కుమారులు తనను సరిగా చూసుకునేవారు కాదు. తనను పోషించడం భారంగా భావించారు. చిన్నకుమారుడు శంకర్ మాయమాటలతో గురువారం రాత్రి మోటార్‌సైకిల్‌పై తీసుకొచ్చి జనసంచారం లేని ప్రాంతంలోని ముళ్లపొదల్లో తోసివేసి వెళ్లిపోయాడని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. వృద్ధురాలు కాంతిమతి కుటుంబం గురించి మరిన్ని వివరాలు చెప్పలేకపోవడంతో సమాచారం రాబట్టేందుకు పోలీసులు శ్రమపడుతున్నారు. పూర్తి సమాచారం రాబట్టిన తరువాత కుమారులపై ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయిస్తామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. మనసు మార్చుకుని కుమారులు వస్తారు, అక్కున చేర్చుకుంటారని ఆ అమాయక తల్లి ఆశగా ఎదురుచూస్తోంది.
చదవండి:
దోషం పోతుందని బిడ్డను బలిచ్చిన తల్లి కేసులో కొత్త విషయాలు
దారుణం: ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలి
Comments
Please login to add a commentAdd a comment