Sonali Phogat Death: Family Alleges Rape & Murder By Sonali Phogat's PA, Files Complaint - Sakshi
Sakshi News home page

సోనాల్‌ ఫోగట్‌పై మూడేళ్లుగా అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌!

Published Thu, Aug 25 2022 10:36 AM | Last Updated on Thu, Aug 25 2022 11:31 AM

Sonali Phogat Death Mystery: Raped Over Years Alleges Family - Sakshi

ఛండీగఢ్‌: బీజేపీ నేత, నటి సోనాల్‌ ఫోగట్‌ హఠాన్మరణంపై అనుమానాల నేపథ్యంలో తీవ్ర ప్రకటనలు ఇస్తోంది ఆమె కుటుంబం. తాజాగా సోదరుడు రింకు ధాక, సంచలన ఆరోపణలకు దిగాడు. ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని  ఆరోపిస్తున్నాడతను.

సోనాల్‌ ఫోగట్‌ పీఏ సుధీర్‌ సంగ్వాన్‌, అతని స్నేహితుడు సుఖ్విందర్‌లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చేవాళ్లని, ఆమెపై హిస్సార్‌లోని ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడి వీడియో తీసేవాళ్లని, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి లోబర్చుకున్నారని రింకు చెబుతున్నాడు. సినీ, రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని సోనాలిని వాళ్లిద్దరూ బెదిరించేవారని, డబ్బు.. ఇతర సౌకర్యాలను అనుభవించేవాళ్లని, పరువుపోతుందనే భయంతోనే ఆమె ఇంతకాలం మౌనంగా ఉండిపోయిందని రింకు పోలీసులకు తెలిపాడు.

చోరీ వంకతో.. 
తన భర్త చనిపోయాక.. కుటుంబం కంటే నటన, రాజకీయాల మీదే దృష్టిసారిస్తూ వచ్చింది సోనాలి ఫోగట్‌. 2019 ఎన్నికల సమయంలో సంగ్వాన్‌, సుఖ్విందర్‌లు సోనాలికి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రతీ విషయంలోనూ వీళ్లిద్దరి జోక్యం ఎక్కువైంది. ఆ సమయంలోనే ఆమెపై అత్యాచారం జరిగింది. ఇక కొంతకాలం కిందట సోనాలి ఇంట్లో చోరీ జరిగింది(ఇదీ కూడా సంగ్వాన్‌ ప్లాన్‌ అనేది రింకు ఆరోపణ). అది సాకుగా చూపి.. ఇంట్లో పని మనుషులను తొలగించారు. అప్పటి నుంచి ఆమె భోజనం బాధ్యతలన్నీ సుధీర్‌ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ భోజనంలో మత్తు మందు కలిపి.. నిత్యం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారని రింకు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఈ విషయాన్ని తమ దగ్గరి బంధువైన అమన్‌కు స్వయంగా సోనాలినే వెల్లడించిందని అంటున్నాడు. అంతేకాదు.. 

షూటింగ్‌ వంకతో..
గోవాలో షూటింగ్‌ పేరుతో సోనాలి ఫోగట్‌ను తీసుకెళ్లారని, తీరా అక్కడికెళ్లాక షూటింగ్‌ లేదని చెప్పారని, ఈ క్రమంలోనే భోజనం చేశాక ఏదోలా ఉందని, అక్కడేదో జరుగుతోందని సోనాలి తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా తెలియజేసిందని, ఫోన్‌ ట్రేస్‌ చేసే ఛాన్స్‌ ఉండడంతో వాట్సాప్‌ కాల్‌ మాట్లాడాలని ప్రయత్నించిందని రింకూ చెప్తున్నాడు.  సోనాలి ఇంటి తాళాల దగ్గరి నుంచి ఫోన్‌, బ్యాంక్‌ కార్డులు, ఆర్థిక లావాదేవీలన్నీ సుధీర్‌ దగ్గరే ఉండేవని, సోనాలి మరణం వార్త తెలిశాక ఆమె ఫోన్లతో పాటు తన ఫోన్లను సుధీర్‌ స్విచ్ఛాప్ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని రింకు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

గోవా డీజీపీ పర్యవేక్షణ
ఆస్తి కోసమే కాదు.. ఆమె హత్య వెనుక రాజకీయ కుట్ర కోణం కూడా దాగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు రింకు. ఈ మేరకు గోవా పోలీసులకు ఫిర్యాదు చేసిన రింకు.. సుధీర్‌, సుఖ్విందర్‌లను అరెస్ట్‌ చేయాలని, తన సోదరికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. గుండెపోటుతో సోనాలి ఫోగట్‌ హఠాన్మరణం చెందిందని భావిస్తుండగా.. ఆమె మరణంపై కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. గోవా డీజీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: ‘శ్రీమతి’ మృతి.. న్యాయం కోసం పాదయాత్ర..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement