న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని, వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
మరోసారి శ్వాసకోశ సమస్యలు?
సోనియా గాంధీ గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గత జనవరిలో కూడా ఆమె ఇదే ఆస్పత్రిలో చేరారు. అప్పట్లో ఢిల్లీలో పెరిగిన కాలుష్యం, తీవ్రమైన చలి కారణంగా ఆమెకు ‘బ్రోన్చియల్ ఆస్తమా’ సమస్య తీవ్రమైందని వైద్యులు తెలిపారు. ఆ సమయంలో ఆమెకు యాంటీబయోటిక్స్‌తో కూడిన చికిత్స అందించగా, పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు.
తాజాగా మరోసారి ఆమె ఆస్పత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఇది కేవలం రెగ్యులర్ చెకప్ లేదా ముందుజాగ్రత్త చర్యగా భాగంగానే జరిగిందా? లేక సమస్య మళ్లీ తీవ్రమైందా? అనే విషయంపై ఆస్పత్రి వర్గాల నుండి పూర్తిస్థాయి మెడికల్ బులెటిన్ వెలువడాల్సి ఉంది.
వైద్యుల పర్యవేక్షణలో..
సర్ గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు సమాచారం. 79 ఏళ్ల సోనియా గాంధీ గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, వయసు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల కారణంగా తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆమె ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు.
రాహుల్ కేరళ పర్యటన రద్దు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు. తన తల్లి, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ మేరకు పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రాహుల్ తన కుటుంబ బాధ్యతల దృష్ట్యా ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
రాహుల్ స్థానంలో మల్లికార్జున ఖర్గే..
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం కోజికోడ్‌లో జరగనున్న భారీ బహిరంగ సభతో రాహుల్ తన ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఏప్రిల్ 9న కేరళలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సభ అత్యంత కీలకంగా భావించారు. రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడంతో, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోజికోడ్ పర్యటనకు బయలుదేరారు. రాహుల్‌కు బదులుగా ఖర్గే ఈ ఎన్నికల ర్యాలీలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.


