జనగణన షురూ! | President Murmu and Vice President filled out the self-enumeration form online for Census 2027 | Sakshi
Sakshi News home page

జనగణన షురూ!

Apr 2 2026 4:33 AM | Updated on Apr 2 2026 12:28 PM

President Murmu and Vice President filled out the self-enumeration form online for Census 2027

స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా సెల్ఫ్‌–ఎన్యూమరేషన్‌(స్వీయ నమోదు) కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రజలు తమ వివరాలను అందజేస్తున్నారు. ఈ సమాచారాన్ని  se. census. gov. in పోర్టల్‌లో పొందుపరుస్తున్నారు. 

సెల్ఫ్‌–ఎన్యూమరేషన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్, రిజిస్ట్రార్‌ జనరల్, సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌తోపాటు ఇతర అధికారుల సమక్షంలో ఆమె తన వివరాలను పోర్టల్‌లో పొందుపర్చారు. ప్రధాని మోదీ సైతం ఈ ప్రక్రియను స్వయంగా పూర్తిచేశారు. దేశ ప్రజలంతా జనగణనలో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని మోదీ ‘ఎక్స్‌’లో పిలుపునిచ్చారు. ప్రజా సాధికారతకు జనగణన అత్యంత కీలకమని స్పష్టంచేశారు.  

16 భాషల్లో జనగణన యాప్‌  
15 రోజులపాటు సెల్ఫ్‌–ఎన్యూమరేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. జనగణన మొత్తం రెండు దశల్లో జరుగుతుంది. తొలి దశలో హౌస్‌ లిస్టింగ్‌ లేదా హౌసింగ్‌ సెన్సస్‌ నిర్వహిస్తారు. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ చేపడతారు. అండమాన్‌ నికోబార్‌ దీవులు, గోవా, కర్ణాటక, సిక్కిం, ఒడిశా, లక్షద్వీప్, మిజోరాం, ఢిల్లీలో సెల్ఫ్‌–ఎన్యూమరేషన్‌ ఆరంభమైంది. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పోర్టల్‌లో ప్రశ్నలకు సమాధానం ఇస్తే విశిష్ట గుర్తింపు సంఖ్య జనరేట్‌ అవుతోంది. 

ఎన్యూమరేటర్‌ ఫీల్డ్‌ విజిట్‌కు వచ్చినప్పుడు ఈ సంఖ్యను అందజేయాల్సి ఉంటుంది. 8 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్‌ 16 నుంచి హౌస్‌ లిస్టింగ్‌ ప్రారంభిస్తారు. మే 15 వరకు కొనసాగుతుంది. జనగణన మొబైల్‌ యాప్‌ 16 భాషల్లో అందుబాటులో ఉంది. హౌస్‌ లిస్టింగ్‌లో అధికారులు ప్రతి ఇంటినీ స్వయంగా సందర్శిస్తారు. అందులో నివాసం ఉండేవారిని 33 ప్రశ్నలు అడుగుతారు. ఈసారి జన గణనతోపాటు కుల గణన కూడా నిర్వహిస్తుండడం విశేషం.   

తొలి రోజు 55,000 నివాసాల్లో..  
ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి రోజు బుధవారం దాదాపు 55,000 కుటుంబాలు స్వీయ గణన సౌకర్యాన్ని వినియోగించుకున్నాయని అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు తమకు అనుకూలమైన సమయంలోనే వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని తెలిపారు. మొబైల్‌ నెంబర్‌ ద్వారా పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యి వివరాలు నమోదు చేయొచ్చని సూచించారు. దేశవ్యాప్తంగా హౌస్‌ లిస్టింగ్‌ను ఈ ఏడాది సెపె్టంబర్‌ 30లోగా పూర్తిచేస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement