సాక్షి, న్యూఢిల్లీ: దేశ భద్రతా రంగంలో అత్యున్నత పోస్టు చీఫ్ ఆఫ్ డిఫెన్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. దానిలో భాగంగా దేశ భద్రతకు కీలకమైన ఆర్మీ, వాయు, నావిక దళాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును రూపొందించింది. వయసు, అనుభవం పరంగా సీనియర్ అయిన బిపిన్ రావత్‌ను తొలి సీడీఎస్‌గా 2019లో నియమించింది మోదీ ప్రభుత్వం.
అయితే దురదృష్టం కొద్ది ఆయన పదవి చేపట్టిన రెండున్నరళ్లేకే అకాల మరణం పొందారు. తమిళనాడు, కూనూరు సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. సైనిక బలగాలకు కొత్త రూపు తెచ్చిన రావత్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదంతో పాటు.. మోదీ సర్కార్‌కు పలు సవాళ్లను కూడా తీసుకొచ్చింది. తదుపరి సీడీఎస్‌గా ఎవరిని నియమించాలన్నది.. ప్రభుత్వం, ముఖ్యంగా రక్షణ శాఖ ముందున్న తక్షణ సవాలు.
(చదవండి: చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్)
అనుభవం ఆధారంగానే రావత్‌కు అవకాశం...
ప్రస్తుతం రక్షణ శాఖలో సీడీఎస్ పదవికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక మొదటి సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన బిపిన్ రావత్ సాయుధ దళాల కోసం ఎన్నో సంస్కర్ణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. రావత్ ఇండియన్ ఆర్మీ చీఫ్ పదవి కాలం ముగియడానికి అనగా పదవీ విరమణకు ఒక్క రోజు ముందుగా ఆయనను సీడీఎస్‌గా నియమిస్తూ.. మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం ఆధారంగానే 2019లో రావత్‌ని సీడీఎస్‌గా నియమించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన రెండున్నరేళ్ల కాలంలోనే ఆయన మృత్యువాత పడ్డారు
వారాల వ్యవధిలో ప్రభుత్వం తదుపరి సీడీఎస్ ఎవరనేది ప్రకటించనున్నట్లు సమాచారం. సీడీఎస్ ఎంపికకు ఎలాంటి నిర్దేశిత నియమాలు లేవు. సరిహద్దు భద్రతా సవాళ్లను దృష్టిలో పెట్టుకుని.. కేంద్ర ప్రభుత్వం సీడీఎస్ నియామకంపై నిర్ణయం తీసుకుంటుంది.
(చదవండి: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్)
సీడీఎస్ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..
సీడీఎస్ నియామక ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. భారత ఆర్మీ, వాయుసేన, నావిక దళాలకు చెందిన ఏ కమాండింగ్ అధికారిని అయినా సీడీఎస్‌గా నియమించవచ్చు. ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే సీడీఎస్‌గా నియమితుడయ్యే వ్యక్తి వయసు 65 ఏళ్లకు మించకూడదు.
రావత్ తర్వాత సీనియర్ నరవాణెనే...
ప్రస్తుత విషయానికి వస్తే.. సైనిక దళాలకు పని చేస్తున్న చీఫ్‌లలో.. బిపిన్ రావత్ తర్వాత సీనియర్.. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె. తదుపరి సీడీఎస్‌గా నరవాణెని నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత ఆర్మీ చీఫ్‌గా నరవాణె పదవీ కాలం 2022, ఏప్రిల్ వరకు ఉంది. అంతేకాక ఆర్మీ చీఫ్‌గా జనరల్ రావత్ నుంచే నరవాణె.. 2019, డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు.
అయితే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్న ప్రస్తుత ఉన్నతాధికారులతో పోలిస్తే.. నరవాణెనే సీనియర్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరీ ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఆ ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలను స్వీకరించారు. ఆర్ హరి కుమార్ నేవీ చీఫ్ అడ్మైర్గా గత నెల 30న నియమితులయ్యారు. దీనితో నరవాణెనే తదుపరి సీడీఎస్‌గా ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment