
సాక్షి ప్రతినిధి, చెన్నై: తన తండ్రి ఆరోగ్యం మరింత మెరుగుపడిందని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ శనివారం తన వీడియో సందేశంలో తెలిపారు. కరోనా వైరస్‌కు గురైన ఎస్పీ బాలు ఈనెల 5వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
ఊపిరితిత్తులు కూడా మెరుగుపడినట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా చేస్తున్న ఫిజియోథెరపీకి కూడా ఆయన శరీరం సహకరిస్తున్నట్లు సమాచారం. కాగా, ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు శనివారం బులెటిన్ విడుదల చేయలేదు.