సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 బారినపడి మరణించి వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర విపత్తుల నివారణ నిధి (ఎస్డీఆర్‌ఎఫ్) నుంచి రూ.4 లక్షలు ఆర్థిక సహాయంగా చెల్లించాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మళ్లీ అదే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని ఉపసంహరించుకుంది. కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రాలు దీనిని విపత్తుగా ప్రకటించి బాధిత కుటుంబాలకు పరిహారంతోపాటు నిర్ధారణ పరీక్షలు, చికిత్స, ఇతర సదుపాయాలు కల్పించాలని కేంద్ర హోం శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పట్లోనే వెనక్కి తీసుకున్న ఈ ఉత్తర్వులు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఆర్థిక సహాయం కోసం నిర్దేశిత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పంపుతున్నారు. అయితే, అసలు విషయం తెలియక చాలామంది నిజంగానే రూ.4 లక్షల పరిహారం లభిస్తుందని భావించారు. ఎస్డీఆర్‌ఎఫ్ కింద చేపట్టే సహాయక పనుల్లో 75 శాతం నిధులను కేంద్రం, 25 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. కరోనా మృతుల సంఖ్య భారీగా ఉండటంతో పరిహారం చెల్లింపు సాధ్యం కాదన్న భావనతో కేంద్రం ఈ ఆదేశాలను ఉపసంహరించుకుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, కరోనా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలన్న అంశంపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.
చదవండి: సై అంటే సై.. నాయకుల సోషల్ యుద్ధం
కరోనా బాధితురాలికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సాయం
Comments
Please login to add a commentAdd a comment