శ్రీనగర్: జూన్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లాలో ఓటమిని చవిచూసిన ఒమర్ అబ్దుల్లా కేవలం కొద్ది వారాల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గతంలోనూ ఇలాగే 38 ఏళ్ల వయసులో తొలిసారిగా జమ్మూకశ్మీర్ సీఎంగా పగ్గాలు చేపట్టి రికార్డ్ సృష్టించారు. అత్యంత పిన్న వయసులో సీఎం అయి 2009–14 కాలంలో రాష్ట్రాన్ని పాలించారు.
స్కాట్లాండ్‌లోని స్ట్రాత్‌క్లీడ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేస్తూ చదువును మధ్యలో వదిలేసిన ఒమర్ 1998లో తొలిసారిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 28 ఏళ్ల వయసులో 12వ లోక్‌సభకు ఎన్నికై అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1999లోనూ జయకేతనం ఎగరేసి పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.
గోధ్రా ఉదంతాన్ని తీవ్రంగా నిరసిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జమ్మూకశ్మీర్ శాసనసభ సమరంలో అడుగుపెట్టి చతికిలపడ్డారు. 2002లో నేషనల్ కన్ఫెరెన్స్ కంచుకోట గందేర్‌బల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనామక ఖాజీ మొహమ్మద్ అఫ్జల్‌చేతిలో ఓడిపోయారు. తర్వాత 2004లో మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు.
తర్వాత జమ్మూకశ్మీర్ అటవీప్రాంతాన్ని శ్రీ అమర్‌నాథ్ ఆలయబోర్డ్‌కు 2008లో ఇచ్చేందుకు నాటి అటవీమంత్రిగా అఫ్జల్ తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అసంతృప్తి నెలకొంది. దీన్ని అవకాశంగా మలచుకున్న ఒమర్ ఆందోళనలు లేవనెత్తారు. పార్టీ బలాన్ని పెంచి ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచించి ఎన్సీని అతిపెద్ద పార్టీగా అవతరింపజేశారు. దీంతో 38 ఏళ్ల వయసులో ఒమర్ కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 54 ఏళ్ల ఒమర్ ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అబ్దుల్లాల కుటుంబం నుంచి సీఎం అయిన మూడోవ్యక్తి ఒమర్. గతంలో ఈయన తాతా షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూక్ అబ్దుల్లా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment