న్యూఢిల్లీ: పధ్నాలుగు సంవత్సరాల క్రితంనాటి కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి మారే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దోషికి హైకోర్టు విధించిన మరణశిక్షను నిలుపుదలచేసింది. 2010లో ఏడేళ్ల పిల్లాడిని కిడ్నాప్‌చేసి చంపిన కేసులో సుఖ్జీందర్ సింగ్‌కు పంజాబ్, హరియాణా హైకోర్టు ఈఏడాది ఆగస్ట్‌లో మరణశిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ దోషి తరఫున లాయర్ హర్వీందర్ సింగ్ మాన్ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాల ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసుకు సంబంధించిన శిక్ష తగ్గింపు నివేదికను బెంచ్ పరీశీలించింది.
హత్య జరిగిన కాలంలో 23ఏళ్ల వయసులో నిందితుడు విపరీతమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని, ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఆ రిపోర్ట్‌లో ఉంది. ‘ఎంతో మారిపోయిన ఇతను ఇకపై సమాజానికి ఏరకంగానూ హానికరం కాదు. 37 ఏళ్ల వయసులో ఇప్పుడు ఇతనిలో సత్ప్రవర్తన వచ్చింది. ఏకంగా మరణశిక్ష విధించేముందు హైకోర్టు ఇతని మానసిక స్థితిపై తుది అవగాహనకు రాలేదు. రిహాబిటేషన్ సెంటర్‌కు పంపే అవకాశం ఇవ్వలేదు’ అని నివేదిక పేర్కొంది. ‘కుటుంబంలో ఒక్కగానొక్క కుమారుడిని చంపాడు. దీంతో ఆ సామాజిక వర్గంలో ఆగ్రహం పెల్లుబికిందన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కిడ్నాపర్‌కు పిల్లాడి తండ్రి డబ్బిచ్చినా చంపాడని హైకోర్టు మరణశిక్ష వేసింది’ అని నివేదిక వివరించింది.
దీంతో కేసు విచారణను 16 వారాలు వాయిదావేసిన సుప్రీంకోర్టు ఈ విషయంలో ప్రొబేషన్ అధికారి నివేదిక ఇచ్చేలా చూడాలని పంజాబ్ సర్కార్‌ను ఆదేశించింది. అమృత్‌సర్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా గడిపిన సమయంలో ఇతని మానసిక పరిస్థితి, తోటి ఖైదీలతో ప్రవర్తన గురించి నివేదించాలని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం దోషి మానసిక స్థితిని టెస్ట్‌లు చేసి ధృవీకరించాలని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ను కోర్టు కోరింది.
Comments
Please login to add a commentAdd a comment