న్యూఢిల్లీ: ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడం మనదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇలా పెళ్లి చేసుకున్నవారికి ఆర్య సమాజ్ నిర్వాహకులు మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంటారు. వీటిపై వధూవరుల పేర్లు, వయసు, చిరునామా, ఇతర వివరాలు ఉంటాయి. అయితే, ఇలా వివాహ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే అధికారం ఆర్యసమాజ్‌కు లేదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అలాంటి సర్టిఫికెట్లు చెల్లవని తెలియజేసింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
సదరు బాధితురాలు మేజరేనని, వారిద్దరూ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారని, మ్యారేజ్ సర్టిఫికెట్ సైతం ఉందంటూ నిందితుడి తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన వెకేషన్ బెంచ్ అంగీకరించలేదు. మ్యారేజీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సింది ప్రభుత్వ సంస్థలు తప్ప ఆర్యసమాజ్ కాదని స్పష్టం చేసింది. నిందితుడికి బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. బాధితురాలి తరపున అడ్వొకేట్ రిషీ మతోలియా హాజరై వాదనలు వినిపించారు. ఆర్యసమాజ్‌లో వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం–1954 ప్రకారం అధికారికంగా నిర్వహించాలని ఆదేశిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 4న స్టే విధించింది. మైనర్ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై రాజస్తాన్‌లోని పడూకలాన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడి బెయిల్ దరఖాస్తును రాజస్తాన్ హైకోర్టు గత నెల 5వ తేదీన తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా భంగపాటే ఎదురయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment