
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన బెయిలు రద్దు పిటిషన్‌లో సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపింది. డిసెంబరు 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయాలని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణ డిసెంబరు 11వ తేదీకి వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిలు రద్దుచేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది.
ఏపీ సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర బెయిలు సమయంలో హైకోర్టు విధించిన షరతులు పొడిగించాలని కోరారు. దీంతోపాటు కేసు గురించి పబ్లిక్ డొమైన్లో ఎలాంటి ప్రకటనలు చేయకుండా చూడాలన్నారు. ఈ సమయంలో.. కోర్టులో ఉన్న అంశాలపై శాఖ అధికారులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ ఆరోపించారు. ఇరుపక్షాలకు ఈ షరతు వర్తించేలా చూడాలని అభ్యర్థించారు. అగర్వాల్ వాదనకు ఏపీ సీఐడీ తరఫు మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అభ్యంతరం తెలిపారు. షరతులనేవి నిందితులకే వర్తిస్తాయని.. ప్రభుత్వానికి వర్తించవని చెప్పారు.
అయితే, మీరు వాయిదా కోరుతున్నారా.. అని ధర్మాసనం ప్రశ్నించగా.. ప్రతివాదికి నోటీసులు జారీచేయాలని రోహత్గి బదులిచ్చారు. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్‌లో మెరిట్స్‌పై నిర్ధారణలు ఉన్నాయని, ఇది రూ.300 కోట్ల ప్రజాధనం మళ్లించిన కేసు అని వివరించారు. ఏపీ సీఐడీ విజ్ఞప్తిని ధర్మాసనం అనుమతించింది. చంద్రబాబుకు నోటీసులు జారీచేస్తున్నామని, నవంబరు 3వ తేదీన ఏపీ హైకోర్టు విధించిన షరతుల్లో బహిరంగ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం లేదా పాల్గొనడం మినహా అన్నీ వర్తిస్తాయని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment