సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా సిద్ధరామయ్యకు కేక్ తినిపిస్తున్న డీకే శివకుమార్
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక సీఎం అభ్యర్థిని తేల్చేందుకు కాంగ్రెస్ పెద్దలు హస్తినలో మల్లగుల్లాలు పడుతున్నారు. పదవి కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తీవ్రంగా తలపడుతుండటంతో రెండు రోజులుగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కడం తెలిసిందే. సీఎల్పీ భేటీలోనూ పీటముడి వీడకపోవడంతో సంప్రదింపుల కోసం వారిద్దరినీ అధిష్టానం హస్తినకు పిలిచింది. దాంతో సిద్ధరామయ్య సోమవారం సాయంత్రమే ఢిల్లీ చేరగా డీకే మాత్రం ‘ఆరోగ్య కారణాల’తో బెంగళూరుకే పరిమితమై మరింత సస్పెన్స్‌కు తెర తీశారు.
ఢిల్లీ వెళ్తున్నట్టు మధ్యాహ్నం దాకా చెబుతూ వచ్చిన ఆయన చివరికి పర్యటనను రద్దు చేసుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వెంటే ఉన్నారన్న వార్తలను మీడియా ప్రస్తావించగా, తాను మొత్తం 135 మంది ఎమ్మెల్యేలకూ నాయకుడినంటూ డీకే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు సోమవారం ఉదయం బెంగళూరులో డీకే 61వ పుట్టినరోజు వేడుకల్లో సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు. ఆ వెంటనే ఒకరు హస్తినలో, మరొకరు బెంగళూరులో తమ ప్రయత్నాలకు పదును పెడుతూ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు.
అసెంబ్లీ పోరులో పార్టీని కలసికట్టుగా విజయ తీరాలకు చేర్చిన వీరిద్దరిలో ఎవరూ పట్టు వీడకపోవడం, వారి మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, నేతలు రెండు శిబిరాలుగా చీలిన నేపథ్యంలో ఈ చిక్కుముడిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీలతో చర్చించి మంగళవారం సాయంత్రానికల్లాల సీఎం అభ్యర్థిని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేస్తారని చెబుతున్నారు.
సీఎం అభ్యర్థి ఎంపికకు ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా ముగ్గురు అధిష్టానం ప్రతినిధుల పర్యవేక్షణలో జరిగిన సీఎల్పీ భేటీ ఎటూ తేల్చలేకపోవడం, నేతలతో, ఎమ్మెల్యేలతో దూతల విడివిడి చర్చలు, రహస్య బ్యాలెట్ వంటివి ఏ ఫలితమూ ఇవ్వకపోవడంతో అభ్యర్థి ఎంపిక అధికారాన్ని పార్టీ అధ్యక్షునికే కట్టబెడుతూ సీఎల్పీ తీర్మానం చేయడం తెలిసిందే. సీక్రెట్ బ్యాలెట్ బాక్సులతో ఢిల్లీ ప్రతినిధులు సోమవారం ఢిల్లీ చేరారు. ఖర్గేకు పరిస్థితి వివరించడంతో పాటు నివేదిక కూడా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment