సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆది నుంచి గవర్నర్ తీరుపై గుర్రుగా ఉన్న డీఎంకే ప్రభుత్వం.. తమ తీరును మరోసారి అసెంబ్లీ సాక్షిగా చాటింది. సోమవారం కీలకమైన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ల నియామకంలో అధికార మార్పిడికి కోసం.. సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. తద్వారా ఇప్పటి వరకు గవర్నర్ పరిధిలో ఉన్న వీసీల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గుజరాత్ తరహాలోనే తమిళనాడులో సైతం వీసీల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని అన్నారు.
గవర్నర్ వద్ద ఈ అధికారులుంటే వివాదాలు తలెత్తుతాయని చెప్పారు. అందుకే తగిన మార్పులతో కొత్త సవరణ చట్టాన్ని తీసుకొచ్చామని వివరించారు. తమిళనాడు ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని మొత్తం 13 వర్సిటీలు విద్యాబోధనలో చారిత్రాత్మకమైన విధానాలను అవలంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వీసీల నియమించే అధికారం లేకపోవడం వల్ల వర్సిటీల పనితీరులో అవకతవకలతో ప్రశ్నార్థకంగా మార్చివేసిందని అన్నారు.
ఈ ఏడాది జనవరిలోనే..
అంతకు ముందు ఉన్నత విద్యాశాఖమంత్రి పొన్ముడి తమిళనాడు యూనివర్సిటీల సవరణ చట్టం –2022 బిల్లును అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టగా ఆమోదించారు. బిల్లు ప్రవేశపెడుతున్న దశలోనే బీజేపీ సభ్యులు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నకాలంలో తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ రాష్ట్ర ఉన్నతవిద్యశాఖకు సంబంధించి బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. వర్సిటీలకు వైస్ చాన్స్‌లర్ల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ కేవలం ఆమోదముద్ర మాత్రమే వేయాల్సి ఉందని డీఎంకే ప్రభుత్వం అంటోంది.
అయితే అన్నాడీఎంకే హయాంలో గవర్నర్ భన్వారీలాల్ వీసీల నియామకం పూర్తి చేయడం వల్లనే ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య విబేధాలు మొదలైనాయని డీఎంకే శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇందువల్లే అన్నావర్సిటీ వీసీ సూరప్పపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ బదిలీ కాగా ఆర్‌ఎన్ రవి ఆ తరువాత బాధ్యతలు చేపట్టారు. కొత్త గవర్నర్ సైతం భన్వారీలాల్ కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నట్లు డీఎంకే భావిస్తోంది.
అంతేగాక ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను తమిళనాడు వీసీలుగా నియమించడం చర్చకు దారితీసింది. ఇకపై వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుందని, ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడుతామని జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం స్టాలిన్ ప్రకటించారు. అనేక రాష్ట్రాల్లో వీసీల నియామకం ప్రభుత్వమే చేస్తోందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి అదే అసెంబ్లీ సమావేశంలో స్పష్టం చేశారు.
కొసమెరుపు
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి అధ్యక్షతన తమిళనాడులోని అన్ని యూనివర్సిటీల వీసీలు, విభాగాధిపతుల మహానాడు నీలగిరి జిల్లా ఊటీలో ‘నవ ప్రపంచలో భారత్ భాగస్వామ్యం’ అనే అంశంపై సోమవారం జరిగింది. ఈ మహానాడు జరుగుతున్న సమయంలో గవర్నర్ అధికారాలను కత్తిరిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం గమనార్హం.
బీజేపీ వాకౌట్
వీసీల నియామకం వ్యవహారంపై బీజేపీ సభ్యులు వాకౌట్ చేయగా, అన్నాడీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి, మరో అంశంపై వాకౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment