
సాక్షి, చెన్నై : రాష్ట్రం పేరు తమిళనాడు, తమిళగం అనే వ్యవహారంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి వెనక్కి తగ్గారనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీలో ఏం జరిగిందో ఏమో గానీ ఆయన తొలుత సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రికలో తమిళగం గవర్నర్ అని పేర్కొన్నారు. అయితే శనివారం విడుదల చేసిన సంక్రాంతి శుభాకాంక్షల్లో మాత్రం తమిళనాడు గవర్నర్ అని పేర్కొనడం చర్చనీయాంశమైంది.
వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ వ్యవహారం ఏకంగా ఢిల్లీకి చేరింది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము స్పందించారు. విచారణ చేపట్టాలని కేంద్ర హోంశాఖను ఆమె ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి శనివారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని కీలక అధికారులను, ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత అధికారులను కలిసినట్లు సమాచారం.
అక్కడ నుంచి వచ్చిన తరువాత సంక్రాంతి శుభాకాంక్షల ప్రకటనలో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్‌రవి అని పేర్కొన్నారు. ఇక పొరుగు రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో లెప్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంక్రాంతి వేడుకల్లో తమిళనాడు కావాలి.. తమిళగం కూడా కావాలని వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment