గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్న డీఎంకే, మిత్రపక్షాల సభ్యులు
సాక్షి, చెన్నై: తమిళనాట గవర్నర్‌కు, డీఎంకే సర్కారుకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో కనీవినీ ఎరగని సంఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం సమావేశాల తొలి రోజు సభనుద్దేశించి గవర్నర్ ఆర్.ఎన్.రవి చేసిన ప్రసంగంలో ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠాన్ని పలుచోట్ల విస్మరించడం వివాదం రాజేసింది. అందులో పేర్కొన్న పేర్లలో వివేకానందున్ని మాత్రం ప్రస్తావించి పెరియార్, అన్నాదురై వంటి ద్రవిడ దిగ్గజాలను ఆయన పక్కన పెట్టారు. ద్రవిడ మోడల్ ఆదర్శంగా పలు అభివృద్ధి పథకాలను చేపట్టాం వంటి పాయింట్లనూ ప్రస్తావించలేదు.
పైగా పలు అంశాలపై తన అభిప్రాయాలను కూడా జోడిస్తూ ప్రసంగించారు. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్లు ప్రసంగ పాఠానికి కట్టుబడటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో రవి తీరుపై అధికార డీఎంకే సభ్యులు భగ్గుమన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అనంతరం ఏకంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు సీఎం ఎంకే స్టాలిన్ సిద్ధమయ్యారు! ‘‘గవర్నర్ ప్రసంగంలోని అసంబద్ధ అంశాలను తిరస్కరించాలి.
సభకు సమర్పించిన లిఖిత ప్రసంగ పాఠం మాత్రమే చెల్లుబాటవుతుందని ప్రకటించాలి’ అని అందులో కోరారు. కానీ స్టాలిన్ మాట్లాడుతుండగానే రవి హఠాత్తుగా లేచి సభ నుంచి నిష్క్రమించారు! అనంతరం తీర్మానాన్ని సభ ఆమోదించింది! రవి తీరు విచారకరమని, ద్రవిడ దిగ్గజాలతో పాటు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరునూ ప్రస్తావించకపోవడం శోచనీయమని స్పీకర్ అప్పవు అన్నారు. సభా సంప్రదాయాలను రవి తుంగలో తొక్కారంటూ మంత్రులు మీడియాతో మండిపడ్డారు.
‘‘జాతీయ గీతాలాపన జరగకుండానే సభను వీడారు. జాతీయ గీతాన్ని కూడా అవమానించారు’’ అని విమర్శించారు. డీఎంకే మద్దతుదారులు ట్విట్టర్‌లో ‘గెటౌట్‌రవి’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆయన బర్తరఫ్‌కు, రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ తీరును ఖండిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు డీఎంకే మిత్రపక్షాలు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, మనిదనేయ మక్కల్ కట్చి, తమిళర్ వాల్వురిమై కట్చి ప్రకటించాయి. బీజేపీ మాత్రం గవర్నర్‌కు మద్దతుగా నిలిచింది.
గవర్నర్ సభలో ఉండగానే ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం పెడతారా అంటూ స్టాలిన్, స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించింది. డీఎంకే, దాని మిత్రపక్షాలు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దుయ్యబట్టారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా సీఎం తీర్మానం ప్రవేశపెట్టడాన్ని విపక్ష అన్నాడీఎంకే తప్పుబట్టింది. దీన్ని రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించింది. గవర్నర్, డీఎంకే సర్కారు మధ్య ఎంతోకాలంగా నిప్పూ ఉప్పు వంటి పరిస్థితి నెలకొని ఉంది.
(చదవండి: యూత్ ఐకాన్‌గా రాహుల్ గాంధీ.. ఆ సత్తా ఉంది: శత్రుఘ్న సిన్హా)
Comments
Please login to add a commentAdd a comment