సాక్షి, చెన్నై: "సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు, పద్యం లేని సాహిత్యం" ఉండదని చెప్తుంటారు. కానీ ఇప్పుడు పద్యం, సామెతలను పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. ఇంగ్లీషు గలగలా మాట్లాడే పిల్లలు పద్యాలు చదవమంటే నోరు తిరగడం లేదు, మా వల్ల కాదు బాబోయ్ అని చేతులెత్తేస్తున్నారు. నిరంతరం ఫోనులోనే ముఖం పెడుతూ దానికి బానిసలవుతున్నారు. ఈ వైఖరి భాషాభిమానులను, సాహిత్యారాధికుల మనసును కలిచి వేస్తోంది. దీంతో తమిళనాడుకు చెందిన కె సెంగుత్తువన్ ఓ అద్భుత ఉపాయం ఆలోచించాడు.
అది కానీ అమల్లో పెడితే చచ్చినట్లు పద్యం నేర్చుకుని అప్పజెప్తారని భావించాడు. వెంటనే తన పెట్రోల్ బంకులో 'పద్యం చెప్పి పెట్రోల్ పట్టుకెళ్లు' అనే ఆఫర్‌ను ప్రకటించాడు. తిరుక్కురల్‌లోని 20 ద్విపద పద్యాలు చెప్తే ఒక లీటర్, 10 పద్యాలు చెప్తే అర లీటర్ పెట్రోల్ ఉచితమని వెల్లడించాడు. అసలే పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. అలాంటి సమయంలో ఉచితంగా పెట్రోల్ ఇస్తామంటే ఊరుకుంటారా! పిల్లలను కూర్చోబెట్టి మరీ పద్యాలు నేర్పించి నేరుగా కరూర్ జిల్లాలోని పెట్రోల్ పంపుకు తీసుకువెళ్తున్నారు. జనవరి 16న ప్రకటించిన ఈ ఆఫర్ ఏప్రిల్ 30తో ముగియనుంది. ఇప్పటివరకు 176 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఈ ఫ్రీ పెట్రోల్ ఆఫర్ గురించి సెంగుత్తువన్ మాట్లాడుతూ.. "లాక్‌డౌన్ వల్ల పిల్లలు ఫోన్లకు మరింత అతుక్కుపోయారు. వారు ప్రముఖ తిరుక్కురళ్ పద్యాలు నేర్చుకోవాలన్న కాంక్షతోనే ఈ ఆఫర్‌కు శ్రీకారం చుట్టాను. ఒకరికి ఒకసారి మాత్రమే ఫ్రీ పెట్రోల్ లాంటి ఆంక్షలేమీ లేవు. కాకపోతే రెండోసారి ఈ ఆఫర్ అందుకోవాలంటే మళ్లీ కొత్త పద్యాలు అప్పజెప్పాల్సిందే. తల్లిదండ్రుల భారాన్ని కొంతైనా తీర్చాలంటే పిల్లలు పద్యాలు కంఠస్తం చేయక తప్పదు మరి" అని చెప్తున్నాడు.
చదవండి: వైరల్: ఇదేం చేప.. చంపినా బతికేస్తోంది!
Comments
Please login to add a commentAdd a comment