
నిర్మానుష్యంగా చెన్నెలోని ప్రధాన రహదారి (ఫైల్)
చెన్నె: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా ఉధృతి తగ్గకపోవడంతో తమిళనాడులో లాక్‌డౌన్‌ను పొడగించారు. అయితే మరికొన్ని సడలింపులు ఇచ్చారు. జూన్ 14వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 7వ తేదీ వరకు ఉన్న లాక్‌డౌన్‌ను తమిళనాడు ప్రభుత్వం జూన్ 14 వరకు పొడగించింది. ఆంక్షలు.. సడలింపులు వంటివి ఉత్తర్వుల్లో వివరంగా పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడగించినా 11 జిల్లాలకు మాత్రం మరికొన్ని ఆంక్షలు విధించారు. ఆ జిల్లాల్లో (కోయంబత్తూరు, నీలగిరిస్, తిరుపూర్, ఈరోడు, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్టణం, మాయిలదుతూరై) కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 24 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం 21,95,402 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 463 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. కరోనా కట్టడి కోసం ఎంకే స్టాలిన్ చర్యలు చేపడుతూనే లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకుండా సహాయక చర్యలు కూడా తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment