డైమండ్ ప్లే బటన్‌తో విలేజ్ కుకింగ్ యూట్యూబ్ చానెల్ సృష్టికర్తలు
యూట్యూబ్.. వినోదానికే కాక ఉపాధికి నయా అడ్డాగా నిలుస్తుంది. పేరుతో పాటు డబ్బులు సంపాదించుకోవాలనుకునే వారి మొదటి ప్రాధాన్యం యూట్యూబ్‌గా మారింది. ఒక్కసారి క్లిక్ అయితే చాలు.. సబ్‌స్క్రైబర్లు.. వ్యూస్.. ఆదాయం వాటంతట అవే వస్తాయి. ఇక యూట్యూబ్‌లో చానెల్ ప్రారంభించడానికి గొప్ప గొప్ప డిగ్రీలు అక్కర్లేదు.. మనలో టాలెంట్ చాలు. ఈ వ్యాఖ్యలను నిజం చేశారు తమిళనాడుకు చెందిన రైతులు. వారు ప్రారంభించిన కుకింగ్ వీడియో చానెల్ నేడు కోటి మంది సబ్‌స్క్రైబర్లతో రికార్డు సృష్టించింది. ఆ వివరాలు..
చెన్నై: తమిళనాడుకు చెందిన విలేజ్ కుకింగ్ చానెల్ గత మూడేళ్లుగా తెగ ఫేమస్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా సదరు చానెల్ ఓ రికార్డు సృష్టించింది. తమిళనాడులో మొదటి సారి కోటి మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించిన చానెల్‌గా గుర్తింపు పొందింది. ఆ వివరాలు..
తమిళనాడు పుడుక్కొట్టై జిల్లా చిన్న వీరమంగళం గ్రామానికి చెందిన ఎం పెరియతంబి అనే వృద్ధుడు గతంలో వంట మాస్టర్‌గా పని చేసేవారు. ఈ క్రమంలో పెరియతంబి, ఆయన మనవలు కలిసి కొన్నెళ్ల క్రితం యూట్యూబ్‌లో ‘‘విలేజ్ కుకింగ్’’ పేరిట ఓ చానెల్ ప్రారంభించారు. పెరియతంబి చేత సంప్రదాయ వంటలు చేయించి.. ఆ వీడియోలని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవారు. ఇక వీరు చేసే వంట కూడా మాములగా ఉండదు. 200-300 వందల మందికి సరిపడేలా భారీ వంట చేస్తారు. వీడియో పోస్ట్ చేసిన తర్వాత తాము వండిన పదార్థాలను సమీపంలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రామల్లో వారికి పెడతారు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వీరిని కలిశారు. వీరితో పాటు వంట చేసి.. అక్కడే కూర్చోని భోజనం కూడా చేశారు. దాంతో ఈ చానెల్ పేరు దేశవ్యాప్తంగా అందరికి తెలిసింది. అప్పటివరకు వారానికి 10 వేలుగా ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్య రాహుల్ గాంధీ వీరి వీడియోలో కనిపించిన తర్వాత 40-50 వేలకు పెరిగింది. ఇక రాహుల్ గాంధీ కనిపించిన వీడియో ఏకంగా 26 మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
తాజాగా సబ్‌స్క్రైబర్ల సంఖ్య కోటికి చేరడంతో యూట్యూబ్ నుంచి వీరికి డైమండ్ ప్లే బటన్ లభించింది. దీని అన్‌బాక్సింగ్ సందర్భంగా ఈ యూట్యూబర్స్ మాట్లాడుతూ.. ‘‘మాకు కేవలం ఆరు నెలలు మాత్రమే వ్యవసాయ పని ఉండేది. మిగతా ఆరు నెలలు ఖాళీగా ఉండే వాళ్లం. దాంతో ఇలా కుకింగ్ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాలని భావించాం. కానీ మా చానెల్ ఇంత పాపులర్ అవుతుందని మేం కలలో కూడా అనుకోలేదు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక వీరు యూట్యూబ్ వ్యూస్ ద్వారా నెలకు 7 లక్షల రూపాయల యాడ్ రెవిన్యూ సంపాదిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వీరు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ని సీఎంపీఆర్‌ఎఫ్ నిధికి 10 లక్షల రూపాయల చెక్ అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment