ముంబై: పెళ్లి గురించి ప్రతి అమ్మాయి ఎన్నో కలలు కంటుంది. అందుకోసం ప్రత్యేకంగా దుస్తులు, నగలు డిజైన్ చేయించుకుంటారు. పెళ్లిలో ధరించే ప్రతి దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇక చాలా మంది పెళ్లిలో నాజుకుగా కనిపించడం కోసం వివాహానికి కొన్ని రోజుల ముందు నుంచే డైటింగ్ వంటివి పాటిస్తుంటారు. ఇదంతా సరే. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను కాదనే హక్కు ఎవరికి లేదు. అలానే ఒకరి శరీరాకృతి గురించి విమర్శించే హక్కు కూడా ఎవరికి లేదు.
కానీ ఈ విషయాన్ని ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని మర్చిపోయినట్లున్నాడు. పెళ్లి లెహంగా కోసం వచ్చిన వైద్యురాలు, ఇన్‌స్టాగ్రమ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ని దారుణంగా అవమానించడట. ‘‘నీ ఆకారం చూసుకున్నావా.. నీ భారీ కాయానికి సెట్ అయ్యె డ్రెస్ మా దగ్గర లేదు’’ అన్నాడట. అతడి మాటలకు బాధపడిన సదరు డాక్టర్ ఇక జన్మలో అతడి స్టోర్‌కు వెళ్ల వద్దని నిర్ణయించుకుంది. మరో డిజైనర్ దగ్గరకు వెళ్లి డ్రెస్ కుట్టించుకుంది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించింది. దీనిపై స్పందించిన తరుణ్ తహిలియాని సదరు వైద్యురాలికి క్షమాపణలు తెలిపాడు. ఆ వివరాలు..
సదరు డాక్టర్ పేరు తనయా నరేంద్ర. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చారు. ‘‘పెళ్లికి ముందు చాలా మంది మీద బరువు తగ్గమని ఒత్తిడి పెంచుతారు. నా విషయంలో కూడా అలానే జరిగింది. నువ్వు కూడా డైటింగ్ చేయోచ్చు కదా అని నా ఫ్రెండ్స్ అడిగారు. బరువు తగ్గడానికి చిట్కాలు కూడా చెప్పారు. కానీ నేను అవే పాటించలేదు. నన్ను నన్నుగా ప్రేమించుకోవడం నాకు బాగా తెలుసు. అందుకే వారి సూచనలు పట్టించుకోలేదు’’ అన్నారు.
‘‘పెళ్లి దుస్తుల విషయంలో నాకు చిన్నప్పటి నుంచే ఓ కోరిక ఉండేది. నా 12వ ఏట నుంచే నేను నా పెళ్లికి తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన పెళ్లి లెహంగా ధరించాలని అనుకునేదాన్ని. ఆ ప్రకారమే పెళ్లికి నెల రోజుల ముందు అంబవట్టాలో ఉన్న తరుణ్ బ్రైడల్ స్టోర్‌కు వెళ్లాను. అక్కడ నాకు తీవ్ర అవమానం జరిగింది. నా శరీరాకృతి గురించి దారుణంగా మాట్లాడారు. నీ భారీ పర్సనాలిటీకి మా దగ్గర డ్రెస్ లేదు అనే సెన్స్‌లో కామెంట్ చేశారు. వారి మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఇక జన్మలో అతడి స్టోర్‌కు వెళ్లకూడదని నిర్ణియంచుకున్నాను’’ అన్నారు.
‘‘పెద్ద శరీరం, వక్షోజాలు ఉంటే డిజైనర్‌లకు ఎందుకు అంత భయమో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను అనితా డోంగ్రే స్టోర్‌కు వెళ్లి నాకు కావాల్సిన లెహంగా గురించి వారికి వర్ణించాను. ఇవారు కేవలం మూడు వారాల వ్యవధిలోనే నాకు నేను కోరిన అందమైన లెహంగా డిజైన్ చేసి ఇచ్చారు. ఇందుకు తనను ఎంత పొగిడినా తక్కువే’’ అన్నారు.
‘‘నన్ను చూడండి. పెళ్లిలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో. నాకు డబుల్ చిన్ ఉంది.. నా పొట్ట బయటకు కనిపిస్తుంది. కానీ ఇవన్ని నా సంతోషాన్ని పాడు చేశాయా.. లేదు కదా. ఎందుకంటే నా కుటుంబం, నా సన్నిహితులు, నా భర్త, నన్ను ప్రేమిస్తున్నాడు... మరీ ముఖ్యంగా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా పెళ్లి ద్వారా నేను నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఇదే. ఆనందంగా ఉండండి. ఎందుకంటే సంతోషంగా ఉన్నవారే ఉత్తమ పెళ్లికుమార్తెలు’’ అంటూ షేర్ చేసిన ఈ స్టోరి ఎందరినో ఆకట్టుకుంది. ఇది చదివిన నెటిజనులు తరుణ్ తహిలియాని విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో తరుణ్ తహిలియాని క్షమాపణలు తెలిపారు. తాను సదరు డాక్టర్ శరీరాకృతిని విమర్శించలేదని.. కరోనా కారణంగా ఆమెకు సెట్ అయ్యే డ్రెస్ తమ స్టోర్‌లో లేదని చెప్పాను అన్నారు. దాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు. ఇక మూడు వారాల్లో లెహంగా డిజైన్ చేయడం సాధ్యం కాదని.. ఒకవేళ చేసినా నాసిరకంగా ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment