సీఎంతో హీరో విజయ్‌ భేటీ..! | Thalapathy Vijay Meets With Tamilnadu CM Palanisamy | Sakshi
Sakshi News home page

సీఎంతో హీరో విజయ్‌ భేటీ..!

Published Tue, Dec 29 2020 7:12 AM | Last Updated on Tue, Dec 29 2020 2:27 PM

Thalapathy Vijay Meets With Tamilnadu CM Palanisamy - Sakshi

సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామితో సినీ నటుడు విజయ్‌ భేటీ అయ్యారు. అత్యంత రహస్యంగా ఆదివారం రాత్రి గ్రీన్‌వేస్‌ రోడ్డులోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. విజయ్‌ను రాజకీయాల్లోకి రప్పించడానికి ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ఎంతో ప్రయత్నం చేశారు. అయితే విజయ్‌ వ్యతిరేకత తెలపడంతో ఎన్నికల కమిషన్‌ వద్ద పార్టీ పేరు నమోదును వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. విజయ్‌ నటించిన మాస్టర్‌ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నా, తెర మీదకు రావడంలో సమస్యలు తప్పడం లేదు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అయి తే, కరోనా కారణంగా రిలీజ్‌ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యా రు. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా చిత్రం విడుదల కాబోతుంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో  50 శాతం మేరకు మాత్రమే సీట్ల భర్తీకి అను మతి ఉంది. ఈ సమయంలో సినిమా విడుదల చేస్తే నష్టం తప్పదన్న ఆందోళన చిత్ర బృందం ఉంది. 

రహస్య భేటీ.. 
మాస్టర్‌ చిత్రాన్ని రూ. 143 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తే నష్టాలు తప్పవని భావిస్తున్న చిత్ర బృందం వాటి నుంచి గట్టెక్కే ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే సీఎం పళనిస్వామిని కలిసి తమ అభ్యర్థనను ఉంచేందుకు సిద్ధమయ్యారు. విజయ్‌తో పాటు నిర్మాతలు, దర్శకుడు సీఎంతో భేటీకి నిర్ణయించారు. అయితే ఈ భేటీని రహస్యంగా ఉంచారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో గ్రీన్‌ వేస్‌ రోడ్డులోని సీఎం ఇంటికి విజయ్‌ వెళ్లారు. తమ తరఫున ఓ లేఖను సీఎంకు అందజేశారు. అందులో థియేటర్లను పూర్తి స్థాయిలో తెరవడం, వంద శాతం సీట్లను భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. అన్ని పరిశీలించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని విజయ్‌కు సీఎం హామీ ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా గతంలో విజయ్‌ నటించిన అనేక చిత్రాలు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో ముందుగానే సీఎంతో విజయ్‌ భేటీ కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement