పెద్దకర్మకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు.. ముగ్గురు సోదరులు మృత్యువాత | Three Brothers Dead In Odisha Train Accident | Sakshi
Sakshi News home page

ఒడిషా ప్రమాదం: పెద్దకర్మకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు.. ముగ్గురు సోదరులు మృత్యువాత

Published Sun, Jun 4 2023 8:26 AM | Last Updated on Sun, Jun 4 2023 8:50 AM

Three Brothers Dead In Odisha Train Accident - Sakshi

బాలాసోర్‌: ఒడిశా రైలుప్రమాద ఘటనలో పలు హృదయవిదారక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సంబంధిత కథనాలు జాతీయ మీడియాలో కనిపించాయి. అందులో ఒడిశాకు చెందిన రమేశ్‌ జెన అనే వ్యక్తి విషాదగాథ కూడా ఉంది. బాలేశ్వర్‌కు చెందిన ఒకావిడకు రమేశ్, సురేష్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. వారిలో పెద్దవాడైన రమేశ్‌ చాలా సంవత్సరాల క్రితమే చెన్నైకి వెళ్లి స్థిరపడ్డారు. ఇటీవల రమేశ్‌ తల్లి కాలంచేశారు. 

దీంతో గత నాలుగు రోజుల క్రితం ఆయన సొంతూరు బాలేశ్వర్‌కు వచ్చారు. పెద్దకర్మ తదితర కార్యక్రమాలు చూసుకుని తిరిగి చెన్నైకి బయల్దేరారు. శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లోనే రమేశ్‌ ప్రయాణించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అన్న మృతిపై తమ్ముడు సురేశ్‌ మాట్లాడారు. ‘ తల్లిమరణంతో దాదాపు 14 సంవత్సాల తర్వాత అన్నయ్య ఇంటికొచ్చారు. కార్యక్రమాలు అన్నీ చూసుకున్నాక స్వయంగా నేనే అన్నను రైల్వేస్టేషన్‌లో దిగబెట్టారు. రైలు ఎక్కుతా నువ్వు వెళ్లిపో అని చెబితే సరేనన్నా. అన్నయ్యను చూడటం అదే చివరిసారి అవుతుందని కలలో కూడా అనుకోలేదు. 

రాత్రిపూట రైలు ప్రమాదం వార్త తెల్సి వెంటనే అన్నకు ఫోన్‌చేశా. ఫోన్‌ లిఫ్ట్‌చేయలేదు. కొద్దిసేపయ్యాక ఎవరో ఆ మొబైల్‌ నుంచి ఫోన్‌చేసి ప్రమాదంలో మీ అన్నయ్య చనిపోయాడని చెప్పారు. మరణవార్త విని హుతాశుడినయ్యా. పరుగున ఘటనాస్థలికి వెళ్లా. మొత్తం వెతికినా లాభంలేకుండా పోయింది. చివరకు బాలేశ్వర్‌ జిల్లా ఆస్పత్రిలో విగతజీవిలా పడి ఉన్న అన్నయ్యను చూసి తట్టుకోలేకపోయా’ అని తమ్ముడు వాపోయాడు. 

ముగ్గురు సోదరులు మృత్యువాత
బారుయిపూర్‌: బాలాసోర్‌ ప్రమాద ఘటన పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన ముగ్గురు సోదరుల కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ముగ్గురూ బతుకుదెరువు కోసం తమిళనాడుకు వెళ్తూ మృత్యువాతపడ్డారు. చరనిఖలి గ్రామానికి చెందిన హరన్‌ గయెన్‌(40), నిషికాంత్‌ గయెన్‌(35), దిబాకర్‌ గయెన్‌(32)లు ఏటా తమిళనాడుకు వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు. ముగ్గురూ ఇటీవలే సొంతూరుకు వచ్చి, తిరిగి కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చెన్నై వెళ్తూ ప్రమాదంలో అసువులు బాశారు. ఈ వార్తతో స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు హతాశులయ్యారు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన హరన్‌కు ఒక కొడుకు, ఇద్దరు పెళ్లయిన కూతుళ్లున్నారు. భార్య అనాజిత మానసిక సమస్యతో బాధపడుతోంది.  నిషికాంత్‌కు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరూ మైనర్లే. దిబాకర్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 

ఇది కూడా చదవండి: అందుకే ఈ ప్రమాదం.. కోరమండల్‌ ప్రమాదం వేళ తెరపైకి కొత్త వాదన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement