ఒడిశా రైలు ప్రమాదం అనంతరం ఇప్పుడు బాధితుల హృదయ విదారక గాథలు వెలుగు చూస్తున్నాయి. ఈ కోవకే చెందిన ఒక కథ అందరి చేత కన్నీరు పెట్టిస్తోంది. తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో చెబుతున్నప్పుడు ఆ బాధితుడు ఎంతో ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నాడు. రైలు ప్రమాదం అనంతరం తన కుమారుడు స్పృహ తప్పిపోయాడని, రెస్క్యూ సిబ్బంది.. తన కుమారుడు మృతి చెందాడని భావించి, కొన్ని వందల మృతదేహాల మధ్య పడేశారని తెలిపారు.
తాను సంఘటనా స్థలానికి వెళ్లి తన కుమారుడిని వెదుకుతున్నప్పుడు అతను మృతదేహాల మధ్య సజీవంగా కనిపించాడన్నారు. బాధితుడు హెలారామ్ మాట్లాడుతూ తనకు బాలాసోర్‌లో రైలు ప్రమాదం జరిగిందని తెలియగానే వెంటనే 230 కిలోమీటర్ల దూరంలోని ప్రమాద స్థలానికి చేరుకున్నానని, తన కుమారుని కోసం వెదకడం ప్రారంభించానని తెలిపారు. ఈ నేపధ్యంలోనే తాను మృతదేహాలు ఉంచిన శవాగారానికి వెళ్లానని అన్నారు. అక్కడ వందలాది మృతదేహాల మధ్య తన కుమారుడు సజీవంగా కనిపించాడన్నారు.
దీంతో తన కుమారుని శరీరాన్ని తానే ఆ మృతదేహాల మధ్య నుంచి బయటకు లాగి, ఆసుపత్రికి తీసుకువెళ్లానని తెలిపారు. తన కుమారుని చేతికి గాయమయ్యిందని పేర్కొన్నారు. కాగా రైలు ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడు తనకు ఫోన్ చేసి, గాయాలపాలయ్యానని తెలిపాడన్నారు. వెంటనే తాను సంఘటనా స్థలానికి చేరుకున్నానని హేలారామ్ పేర్కొన్నారు. తరువాత మృతదేహాలను ఉంచిన బహనాగా పాఠశాలలోని శవాగారానికి వెళ్లి, కుమారుని కోసం వెదికానన్నారు. ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం(జూన్ 2) నాడు జరిగిన రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు.1200 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment