పుష్ టు టాక్ ఫోన్‌తో కలెక్టర్ ప్రదీప్‌కుమార్
సాక్షి, చెన్నై: తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్‌కుమార్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన పరిధిలోని అధికారులతో సమన్వయం కోసం అందరికీ పుష్..టు టాక్ పేరిట కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చా రు. వివరాలు.. ప్రదీప్‌కుమార్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిధిలోని అధికారులను ప్రజా సేవలో సమన్వయ పరిచేందుకు, ప్రభుత్వ కార్యాక్రమాల విస్తృతం చేయడమే లక్ష్యంగా కొత్త ప్రయోగంపై ఆయన దృష్టి పెట్టారు. ఇందుకోసం విదేశాల నుంచి పుష్ టు టాక్ పేరిట 35 కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేశారు.
ఆపదలో రక్షణ కవచం..
తొలి విడతగా జిల్లా పరిధిలోని రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి విభాగాల అధికారులకు ఈ పుష్ టు టాక్ ఫోన్లను అందజేశారు. అయితే, ఈ ఫోన్లకు నంబర్లు ఉండవు. ఎవరెవరి చేతిలో ఈ ఫోన్లు ఉన్నాయో కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. సంబంధిత అధికారితో అత్యవసరంగా మాట్లాడదలిచినా, సమాచారం అందజేయాలని భావించినా ఇందులో ప్రత్యేక ఆఫ్షన్లు ఉంటాయి.
కలెక్టర్ మాత్రం ఒకేసారిగా 35 మందితో మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే, ఆయా అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారో కలెక్టర్ ఇట్టే పసిగట్టేందుకు కూడా అవకాశం ఉంది. ఈ ఫోన్‌లు డైరెక్ట్‌గా మొబైల్ టవర్ల ద్వారా పనిచేస్తాయి. మహిళా అధికారులు ఎక్కడైనా తనిఖీలకు వెళ్లిన సమయంలో ఏదేని ప్రమాదం తలెత్తినా, ఆపదలో ఉన్నా.. ఇందులోని ఎస్‌ఓఎస్ అనే ఎమర్జెన్సీ బటెన్‌ను నొక్కగానే అందరికీ సమాచారం క్షణాల్లో వెళ్తుంది. సమీపంలోని ఉన్నతాధికారులు తక్షణం అక్కడికి చేరుకుని అండగా నిలుస్తారు.
ఈ విషయంపై కలెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, తాను ఏదేనా సమాచారం పంపిన పక్షంలో, అధికారులు ఇతర పనుల్లో ఉంటే ఆ వివరాలు ఈ ఫోన్లలో అట్టే నిల్వ ఉంటాయని పేర్కొన్నారు. అధికారులు ఎవరైనా ఆపదలో ఉన్న పక్షంలో ఆరంజ్ కలర్ బట్టన్‌ను నొక్కితే చాలు అని, తనతో పాటుగా అందరం తక్షణం సంబంధిత ప్రాంతానికి చేరుకుంటామని వివరించారు. సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లేందుకే ఈ ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment