tiruchi
-
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: బంగారు తిరుచ్చి ఉత్సవం (ఫొటోలు)
-
Tamil Nadu: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి Vs ఎంపీ!
తిరుచ్చి వేదికగా అధికార డీఎంకే వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు చెందిన మద్దతు దారుల మధ్య బుధవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం తమ నేతకు విలువ ఇవ్వడం లేదంటూ ఎంపీ శివ అనుచరులు మంత్రి నెహ్రూకు వ్యతిరేకంగా తొలుత నల్ల జెండాలను ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీంతో పోలీస్ స్టేషన్లోకి చొరబడి మరీ ఎంపీ అనుచరులను మంత్రి వర్గీయులు చితక్కొట్టారు. సాక్షి, చెన్నై: డీఎంకేలో నగరాభివృద్ధి శాఖ మంత్రిగా, పారీ్టలో సీనియర్ నేతగా కేఎన్ నెహ్రూ మంచి గుర్తింపు పొందారు. ఇక, ఎంపీ శివ ఢిల్లీ వేదికగా డీఎంకే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఇద్దరు తిరుచ్చికి చెందిన వారే. ఇదే జిల్లా నుంచి మరో మంత్రిగా అన్బిల్ మహేశ్ కూడా ఉన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేకున్నా, మంత్రి నెహ్రూ, ఎంపీ తిరుచ్చి శివ మాత్రం ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్నారు. నిరసనతో మొదలై.. తిరుచ్చిలో బుధవారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త భవనాల నిర్మాణాలకు శంకు స్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటికి ప్రారంభోత్సవాలు పెద్దఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి నెహ్రూ బిజీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమాలకు ఎంపీ తిరుచ్చి శివను ఆహ్వానించక పోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో తిరుచ్చి కంటోన్మెంట్‌లోని ఎంపీ శివ ఇంటికి సమీపంలోని ఓ క్రీడా మైదానం ప్రారంభోత్సవానికి ఉదయాన్నే మంత్రి నెహ్రూ వచ్చారు. ఈ సమయంలో శివ వర్గీయులు నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన తెలియజేయడం వివాదానికి ఆజ్యం పోసింది. శివ వర్గీయులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రా రంబోత్వవాన్ని ముగించుకుని మంత్రి నెహ్రూ తిరుగు ప్రయాణంలో ఉండగా, ఆయన మద్దతుదారులు రెచ్చి పోయారు. తిరుచ్చి శివ ఇంటి ముందు ఆగి ఉన్న కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఇంటి ముందు ఉన్న వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. మంత్రి కళ్లెదుటే ఈ దాడులు జరగడం గమనార్హం. అంతటితో వదిలి పెట్టక నేరుగా మంత్రి మద్దతుదారులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భద్రతా విధుల్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. 100 మందికి పైగా వచ్చిన మంత్రి మద్దతుదారులు లోనికి చొరబడి వీరంగం సృష్టించారు. తిరుచ్చి శివ వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శాంతికి గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ శివ ఇంటి వద్ద పోలీసు భద్రతను పెంచారు. పోలీసు స్టేషన్లోకి చొరబడి దాడులకు పాల్పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పార్టీ నాయకుల వీరంగంపై సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్ చేశారు. தேர்தலுக்கு முன்னாடியே போலீஸ் ஸ்டேசனுக்கு லஞ்சம் குடுத்த @KN_NEHRU வை அமைச்சரா ஆக்குனா ஸ்டேசன்ல இதான் நடக்கும். pic.twitter.com/XezvEN06DW — Savukku Shankar (@Veera284) March 15, 2023 నెల్లైలోనూ వివాదం.. తిరుచ్చిలో ఇద్దరు కీలక నేతల మద్దతు దారుల మధ్య వార్ చోటు చేసుకుంటే, తిరునల్వేలిలో మేయర్, జిల్లా కార్యదర్శి మధ్య సమరం రాజధానికి చెన్నైకు చేరింది. తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్ శరవణన్, జిల్లా పార్టీ కార్యదర్శి అబ్దుల్ వకాబ్ మధ్య వివాదంతో ఆ కార్పొరేషన్ డీఎంకే చేజారే పరిస్థితి నెలకొంది. అబ్దుల్ వకాబ్ మద్దతుగా 30 మందికి పైగా కార్పొరేటర్లు మేయర్ శరవణన్‌కు వ్యతిరేకంగా తిరుగు బావుట ఎగుర వేశారు. మేయర్‌ను తప్పించాలని నినాదిస్తూ చెన్నైకు బుధవారం ప్రయాణమయ్యారు. మా«ర్గంమధ్యలో తిరుచ్చిలో మంత్రి కేఎన్ నెహ్రూను కలిసి కొందరు కార్పొరేటర్లు వినతి పత్రం సమరి్పంచారు. గురువారం చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో మేయర్‌పై ఫిర్యాదు చేయనున్నారు. ఐదుగురికి పార్టీ నుంచి ఉద్వాసన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడుల నేపథ్యంలో పోలీసు స్టేషన్లోకి చొరబడి వీరంగం సృష్టించిన వారిపై డీఎంకే అధిష్టానం కన్నెర్రజేసింది. తిరుచ్చి కార్పొరేటర్లు ముత్తసెల్వం, విజయ్, రాందాసు, యూనియన్ నేత దురై రాజ్, ఉపనేత తిరుపతిని పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఎంకే కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఐదుగురు పోలీసు స్టేషన్లో లొంగి పోయారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడి ప్రత్యర్థులపై జరిపిన దాడికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీరంతా పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. -
400 ఏళ్ల నాటి పురాతన రాజ వంశ విగ్రహం కోసం...దొంగలకే టోపీ పెట్టి
చెన్నై: తమిళనాడులోని పురాతన విగ్రహాలను కనిపెట్టే వింగ్(ఐడల్ వింగ్)కి సేతుపతి వంశానికి చెందిన 400 ఏళ్ల నాటి పురాతన విగ్రహం గురించి సమాచారం అందింది. ఈ మేరకు ఐడల్ వింగ్ బృందం అండర్ కవర్ అపరేషన్ చేపట్టి ఆ విగ్రహాన్ని కనిపెట్టారు. ఈ మేరకు అధికారులు తుత్తకుడి నివాసితులైన ఆరుముగరాజ్, కుమార్వేల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పురాతన విగ్రహాన్ని విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు తమ సిబ్బందిలోని కొంతమంది ధనవంతులైన వ్యక్తులుగా వారిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. ఈ విధంగా ధనవంతులైన వ్యక్తులుగా ఆ విగ్రహానికి కొనుగోలు చేసే నెపంతో వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని వ్యూహం పన్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ముస్తఫ్ అనే వ్యక్తి పురాతన విగ్రహాన్ని తిరుచ్చి - మదురై హైవేపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఐతే పోలీసులు ఆ విగ్రహాన్ని చూడటానికి కోట్లలలో తమ వద్ద డబ్బు ఉందని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఆ స్మగ్లర్లతో బేరసారాలు ఆడుతూ అసలు గుట్టంతా తెలసుకుని ముస్తఫా, ఆరుముగరాజ్, కుమారవేల్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ నిందితులను విచారించగా తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి నుంచి ఈ విగ్రహాన్ని పొందినట్లు తెలిపాడు. ఐతే సెల్వకుమార్ వద్దే ఈ విగ్రహం 12 ఏళ్లుగా ఉందని, దీన్ని తన తండ్రి నాగరాజన్ ఇచ్చాడని చెప్పాడు. ఈ విగ్రహం సేతుపతి వంశానికి చెందిన పురాతన మహిళ విగ్రహం. ఆ విగ్రహం ఖరీదు వేల కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు . (చదవండి: కస్టమర్‌కి చేదు అనుభవం... అలా వచ్చాడని టికెట్టు ఇవ్వనన్న మల్టీప్లెక్స్ థియేటర్) -
వాట్ యాన్ ఐడియా సర్ జీ! అధికారులకు కొత్త రకం ఫోన్లు ఇచ్చిన కలెక్టర్
సాక్షి, చెన్నై: తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్‌కుమార్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన పరిధిలోని అధికారులతో సమన్వయం కోసం అందరికీ పుష్..టు టాక్ పేరిట కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చా రు. వివరాలు.. ప్రదీప్‌కుమార్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిధిలోని అధికారులను ప్రజా సేవలో సమన్వయ పరిచేందుకు, ప్రభుత్వ కార్యాక్రమాల విస్తృతం చేయడమే లక్ష్యంగా కొత్త ప్రయోగంపై ఆయన దృష్టి పెట్టారు. ఇందుకోసం విదేశాల నుంచి పుష్ టు టాక్ పేరిట 35 కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేశారు. ఆపదలో రక్షణ కవచం.. తొలి విడతగా జిల్లా పరిధిలోని రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి విభాగాల అధికారులకు ఈ పుష్ టు టాక్ ఫోన్లను అందజేశారు. అయితే, ఈ ఫోన్లకు నంబర్లు ఉండవు. ఎవరెవరి చేతిలో ఈ ఫోన్లు ఉన్నాయో కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. సంబంధిత అధికారితో అత్యవసరంగా మాట్లాడదలిచినా, సమాచారం అందజేయాలని భావించినా ఇందులో ప్రత్యేక ఆఫ్షన్లు ఉంటాయి. కలెక్టర్ మాత్రం ఒకేసారిగా 35 మందితో మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే, ఆయా అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారో కలెక్టర్ ఇట్టే పసిగట్టేందుకు కూడా అవకాశం ఉంది. ఈ ఫోన్లు డైరెక్ట్‌గా మొబైల్ టవర్ల ద్వారా పనిచేస్తాయి. మహిళా అధికారులు ఎక్కడైనా తనిఖీలకు వెళ్లిన సమయంలో ఏదేని ప్రమాదం తలెత్తినా, ఆపదలో ఉన్నా.. ఇందులోని ఎస్ఓఎస్ అనే ఎమర్జెన్సీ బటెన్‌ను నొక్కగానే అందరికీ సమాచారం క్షణాల్లో వెళ్తుంది. సమీపంలోని ఉన్నతాధికారులు తక్షణం అక్కడికి చేరుకుని అండగా నిలుస్తారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, తాను ఏదేనా సమాచారం పంపిన పక్షంలో, అధికారులు ఇతర పనుల్లో ఉంటే ఆ వివరాలు ఈ ఫోన్లలో అట్టే నిల్వ ఉంటాయని పేర్కొన్నారు. అధికారులు ఎవరైనా ఆపదలో ఉన్న పక్షంలో ఆరంజ్ కలర్ బట్టన్‌ను నొక్కితే చాలు అని, తనతో పాటుగా అందరం తక్షణం సంబంధిత ప్రాంతానికి చేరుకుంటామని వివరించారు. సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లేందుకే ఈ ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. -
Tamil Nadu: విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న వారంరోజులకు టీచర్ మృతి.. అసలేంజరిగింది?
లైంగిక వేధింపుల కారణంగా ఓ ఇంటర్ విద్యార్థిని వారం క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఐతే సూసైడ్ నోట్లో అందుకు కారణమైన వారి పేరును బాలిక ప్రస్తావించలేదు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అదే స్కూల్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు ఉరేసుని ఆహ్మహత్యకు పాల్పడ్డాడు. ఈ జంట మరణాలు స్థానికంగా కలకలం రేపాయి. అసలేంజరిగిందంటే.. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని లైంగిక వేధింపుల కారణంగా చనిపోతున్నట్లు తెలుపుతూ సూసైడ్ నోట్‌రాసి గతవారం ఆత్మహత్య చేసుకుంది. అంతేకాకుండా తన సూసైడ్ నోట్లో ‘లైంగిక వేధింపుల కారణంగా కరూర్‌లో చనిపోయే చివరి అమ్మాయి నేనే కావాలి. నా ఈ నిర్ణయానికి కారణం ఎవరో చెప్పడానికి భయపడుతున్నాను. . నేను ఈ భూమిపై చాలా కాలం జీవించాలని, ఇతరులకు సహాయం చేయాలని అనుకున్నాను. కానీ ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తోంద’ని తెల్పింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణలో భాగంగా విద్యార్ధిని చదివే పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రశ్నించారు. అందులో భాగంగా ఐతే అదే స్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శరవణన్ (42)ను కూడా ప్రశ్నించారు. మ్యాథ్స్ టీచర్‌పై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసు అధికారులు నిర్ధారించారు. చదవండి: మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...! ఐతే ఈ సంఘటన చోటుచేసుకున్న వారం రోజుల తర్వాత గణిత ఉపాధ్యాయుడు శరవణన్ తన సూసైడ్ నోట్లో బాలిక మరణంపై విద్యార్థులు తనను ఆటపట్టించడంతో ఇబ్బందిపడ్డానని, బాలిక తన నోట్లో ఎవరి పేరు చెప్పనప్పటికీ అతనిపై అనుమానాలు తలెత్తాయని, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ సంఘనపై ఒక పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. గణిత ఉపాధ్యాయుడి మరణం వెనుక ఉన్న కారణం మాకు ఖచ్చితంగా తెలియరాలేదు. సమగ్ర విచారణ తర్వాత కారణాలు తెలియజేస్తామని అన్నారు. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? -
ప్రపంచానికి పాఠాలు చెబుతోంది
చీచదువుకుంటూ ట్యూషన్ చెప్పేవాళ్లు కొత్త కాదు. ఆన్లైన్ ట్యూషన్లు చెప్పడం కూడా కొత్త కాదు. కాని తిరుచ్చికి చెందిన బి.టెక్ విద్యార్థిని భారతీయులకు కాకుండా ప్రపంచ విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. లండన్, న్యూజిలాండ్, సింగపూర్, అమెరికా జాతీయులు ఆమె పాఠాలకు డాలర్లు పే చేస్తున్నారు. లాక్డౌన్లో తన చదువు తాను చదువుకుంటూనే మంచి సంపాదనలో ఉన్న కె.విశ్వతిక మీరూ ఇలా చేయొచ్చని చెబుతోంది. తిరుచ్చిరాపల్లిలోని తన ఇంటిలోని గదిలో సాయంత్రం ఆరు తర్వాత విశ్వతిక ల్యాప్‌టాప్ తెరుస్తుంది. ఆ వెంటనే ఆమె ఆన్లైన్ ట్యూషన్లు మొదలవుతాయి. విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ ఆమె వారికి పాఠాలు చెబుతుంది. డౌట్లు క్లియర్ చేస్తుంది. వారు భారతీయులు కాదు. వారి ఇంగ్లిష్ ఉచ్చారణ వేరు. అయినప్పటికీ తనకొచ్చిన ఇంగ్లిష్‌తోనే వారిని ఆకట్టుకుంటూ ‘మాకూ పాఠాలు చెప్పు’ అనేంత డిమాండ్ తెచ్చుకుంది విశ్వతిక. మేనకోడలితో మొదలు విశ్వతిక బెంగళూరులోని సి.ఎం.ఆర్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతోంది. కరోనా లాక్డౌన్ వల్ల గత సంవత్సరం నుంచి తన స్వస్థలం అయిన తిరుచ్చి (తమిళనాడు)లోనే ఉంటూ చదువుకుంటోంది. అయితే ఆమె మేనకోడలు కాలిఫోర్నియాలో స్కూలు విద్యార్థిని. ‘నాకు ఆన్లైన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠాలు చెప్పవా’ అని అడిగితే సరేనని సరదాగా మొదలెట్టింది. కాని ఆ మేనకోడలు ఎంత ఇంప్రెస్ అయ్యిందంటే తన మేనత్తను విపరీతం గా మెచ్చుకోసాగింది ఆమె టీచింగ్ పద్ధతికి. ‘నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ ఇష్టం. నేను బాగానే పాఠాలు చెబుతున్నానని నా మేనకోడలి వల్ల అర్థమైంది’ అని విశ్వతిక అంది. ఆ ఆత్మవిశ్వాసంతో ఆమె ఒక ఆన్లైన్ పోర్టల్‌లో ట్యూషన్ టీచర్‌గా తన పేరు నమోదు చేసుకుంది. ఆక్కడి నుంచి ఆమె జీవిత పాఠమే మారిపోయింది. బ్రిటిష్ విద్యార్థి ప్రచారం ఆన్లైన్ పోర్టల్ ద్వారా విశ్వతికకు నాలుగో తరగతి చదువుతున్న ఆలియా అనే పదేళ్ల బ్రిటిష్ విద్యార్థిని మొదటిసారిగా ట్యూషన్‌కు వచ్చింది. పైథాన్ అనే కోడింగ్ ప్రోగ్రామ్ గురించి పాఠాలు నేర్చుకుంది. ఆలియాకు విశ్వతిక పద్ధతి నచ్చి లండన్‌లో ఉన్న తన ఫ్రెండ్స్ చాలామందికి విశ్వతిక గురించి చెప్పింది. ‘అందరూ కోడింగ్ ప్రోగ్రామ్స్‌తో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేథమేటిక్స్‌లో ట్యూషన్లకు చేరడం మొదలెట్టారు’ అంది విశ్వతిక. నెమ్మదిగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి విశ్వతిక పేరు ప్రచారం కాసాగింది. ప్రస్తుతం ఆమెకు విదేశాలలో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరికొందరు లైన్లో ఉన్నారు. ఆమె పాఠాలకు డాలర్లకు పే చేస్తున్నారు. ‘నేను సందేహాలు తీరుస్తూ పాఠాలు చెబుతాను. అది అందరికీ నచ్చుతోంది’ అంటోంది విశ్వతిక. ఇంగ్లిష్ నేర్చుకుని విశ్వతిక కంప్యూటర్ చదువులో మంచి తెలివున్న విద్యార్థిని. ప్రోగ్రామ్స్ రాస్తుంది. అలాగే ఇంగ్లిష్ కూడా ముఖ్యమని తెలుసు. అందుకే చెన్నై బ్రిటిష్ కౌన్సిల్ నుంచి షార్ట్‌టర్మ్ కోర్సు చేసింది. ‘అయితే వివిధ దేశాలలోని విద్యార్థుల ఉచ్చరణ నా ఉచ్చరణ వేరు. అయితే అది నా పాఠాలకు అడ్డు కాలేదు’ అంటుంది విశ్వతిక. ఆమె గట్టిగా 20 దాటలేదు. ఇప్పటికే రెండు ఫార్మసూటికల్ సంస్థల కోసం సాఫ్ట్వేర్ తయారు చేసి ఇచ్చింది. అంతేనా? ఆరు మంది ఎం.బి.ఏ గ్రాడ్యుయేట్స్‌ను తన ప్రాడక్ట్స్ అమ్మేందుకు ఉద్యోగులుగా కూడా పెట్టుకుంది. ‘ఆన్లైన్ క్లాసులకు చాలా భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో గుర్తింపు పొందిన ఆన్లైన్ స్కూళ్లు వస్తాయి. విద్యార్థులు వాటిలో చదువుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న స్కూళ్లు ఇక మీదట పిల్లలు కేవలం కంప్యూటర్లలోనే చూస్తారు’ అని జోస్యం చెబుతోంది విశ్వతిక. తెలివి ఒకరి సొత్తు కాదు. ఉన్న తెలివిని ఉపయోగించే మార్గాలు కొత్తగా అన్వేషించడమే మన పని అని దారి చూపుతోంది విశ్వతిక. – సాక్షి ఫ్యామిలీ -
మద్యం అమ్మకాలు; మండిపడ్డ మహిళలు
చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మద్యం దుకాణాలను తెరవడంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ కొనసాగుతుండగానే మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మహిళాలోకం మండిపడుతోంది. తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా మహిళలు నిరసన చేపట్టారు. లిక్కర్ షాపులు తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మద్యం దుకాణాల ముందు బైఠాయించారు. (తమిళనాడులో కరోనా విలయతాండవం) అమ్మకాలు అదుర్స్.. కాగా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తమిళనాడులో గురువారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా మొదటి రోజే రాష్ట్ర ఖాజానాకు రూ. 172 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత వైన్ షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు క్యూ కట్టారు. మొదటి రోజే 20 లక్షల లీటర్ల మద్యం అమ్ముడుపోయిదంటే మందు బాబులు ‘ఎంత దాహం’ మీద ఉన్నారో అర్థమవుతోంది. ప్రతి రాష్ట్రంలో అమ్ముడుయే పాలకంటే ఇది 4 లక్షల లీటర్లు మాత్రమే తక్కువ. ఇక మహిళలు ఆందోళనకు తిరుచ్చిలోనే ఓ మద్యం దుకాణం ‘ఆల్కహాలికుల’ కోసం షామినా, కుర్చీలు ఏర్పాటు చేయడం విశేషం. (టోకెన్ ఉంటేనే మద్యం అమ్మబడును) -
లలితా జ్యుయెలరీ దోపిడీ కేసు; అప్డేట్
సాక్షి, బనశంకరి (బెంగళూరు): తమిళనాడులో సంచలనం సృష్టించిన తిరుచ్చి లలితా జ్యుయెలరీ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు అంతరాష్ట్ర దోపిడీదారుడిని బెంగళూరు బొమ్మనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.5 కోట్ల విలువ చేసే 12 కేజీల బంగారు, ప్లాటినం నగలు, వజ్రాభరణాలతో పాటు టవేరా కారును స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ మంగళవారం తెలిపారు. ఈ సొత్తును హోంమంత్రి బసవరాజ బొమ్మైతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు తిరుచనాపల్లి తిరువంబూర్‌కు చెందిన మురుగన్(45) అలియాస్ బాలమురుగన్, శివకుమార్, శివ తదితర పేర్లతో తిరుగుతూ.. వివిధ రాష్ట్రాల్లో తన అనుచరులతో కలిసి భారీ దోపిడీలకు పాల్పడేవాడు. తిరుచ్చి లలితా జ్యుయెలరీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖలో దోచుకున్న బంగారు ఆభరణాలను తిరుచ్చి నది పక్కన అడవిలో గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. ఇటీవల బొమ్మనహళ్లిలో చోటుచేసుకున్న చోరీ కేసులో తీవ్రంగా గాలించిన పోలీసులు మంగళవారం మురుగన్‌ను అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా దొంగతనాల చిట్టా విప్పాడు. అతడిపై బెంగళూరులో బాణసవాడి, మడివాళ, హెచ్ఎస్ఆర్ లేఔట్, అమృతహళ్లి, నెలమంగల, అనేకల్‌లో చోరీ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అనేక బ్యాంకుల్లో అతడు చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. కాగా మురుగన్‌ను నాలుగు రోజుల కిందటే బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి బంగారు సొత్తును రికవరీ చేసినట్లు తెలిసింది. -
నాకెవ్వరూ పోటీ కాదు: స్టాలిన్
చెన్నై: కేంద్రంలో బీజేపీని మళ్లీ గద్దెనెక్కకుండా చేయడం, రాష్ట్రంలో అన్నాడీఎంకేను ఓడించడమే తమ లక్ష్యమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం మీడియాకు తెలిపారు. టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) దక్షిణ చెన్నై సెక్రెటరీగా వ్యవహరిస్తున్న వీపీ కళైరాజన్ ఈ రోజు మధ్యాహ్నం డీఎంకేలో చేరారు. తిరుచ్చిలో జరిగిన ఒక సభలో కళైరాజన్‌ను పార్టీలోకి ఆహ్వానించిన స్టాలిన్ మాట్లాడుతూ బీజేపీ, అన్నాడీఎంకే ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏఎంఎంకేతోపాటు వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. బీజేపీ, అన్నాడీఎంకేలను ఎదుర్కోవడం తమతోనే సాధ్యమని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన కళైరాజన్ మాట్లాడుతూ ‘తమిళనాడును కాపాడే సత్తా, ద్రవిడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే తెగువ స్టాలిన్‌కే ఉన్నాయన్నారు. కళైరాజన్‌ను ఏఎంఎంకే నుంచి దినకరన్ బుధవారం బహిష్కరించారు. వీ సెంథిల్ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రెండో నేత కళైరాజన్. -
కడుపులో బంగారం
సాక్షి, అన్నానగర్ (చెన్నై): బంగారు బిస్కెట్లు కడుపులో ఉంచుకుని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి నుంచి ఎట్టకేలకు వైద్యులు వాటిని బయటకు తీశారు. తమిళనాడుకు చెందిన చెందిన మహ్మద్ ముస్తఫా సలీం ఈనెల 19న ఎయిర్ ఆసియా విమానంలో మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి తిరుచ్చికి వచ్చాడు. అతడు కడుపులో ఏడు బంగారు బిస్కెట్లు ఉంచుకుని వచ్చినట్టు అధికారులు గుర్తించారు. బంగారు బిస్కెట్లను అరటి పండులో పెట్టుకుని మింగేసి అక్రమంగా తరలించేందుకు అతడు ప్రయత్నించినట్టు కనుగొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతితో కడుపులోంచి బంగారు బిస్కెట్లు బయటకు తీసేందుకు తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పారు. వైద్యులు ఎనిమా ఇచ్చి సోమవారం ఒక బిస్కెట్‌ను బయటికి తీశారు. మంగళవారం మరో నాలుగు బిస్కెట్లు వెలుపలకు తీశారు. బుధవారం సాయంత్రం మిగిలిన రెండు బిస్కెట్లు వెలికితీశారు. ఆ ఏడు బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 205 గ్రాముల బరువున్న వీటి విలువ రూ.5 లక్షల 96వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రామనాథపురం జిల్లా ఎస్పీ పట్టణ వాసిగా గుర్తించారు. -
మద్దిలేటి క్షేత్రంలో తిరుచ్చి వేడుకలు
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి తిరుచ్చి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితులు జ్వాలా చక్రవర్తి, ప్రధాన అర్చకుడు మద్దిలేటి స్వామిలు.. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మద్దిలేటి నరసింహస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీల్లో ఉత్సమూర్తులను కొలువుంచి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. పుష్పాలంకరణ శోభితుడై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. -
కస్టమ్స్ కార్యాలయంలో 'మళ్లీ' బంగారం మాయం
తిరువొత్తియూరు: తిరుచ్చి కస్టమ్స్ కార్యాలయంలో మరో 15 కిలోల బంగారం మాయం అయినట్టు సమాచారం బయటకు పొక్కడంతో బంగారం స్వాధీనం చేసుకునే అధికారుల వద్ద సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. విదేశాల నుంచి విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి అక్రమంగా తీసుకొచ్చే బంగారం, ఖరీదైన వస్తువులను ఇలాగే సముద్రమార్గంగా అక్రమంగా తీసుకొచ్చే బంగారాన్ని రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు కస్ట మ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని తిరుచ్చి విలియమ్స్ రోడ్డులో ఉన్న కస్టమ్స్, పన్ను వసూలు కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తారు. గత సంవత్సరం తిరువారూరులో స్వాధీనం చేసుకున్న 18.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ లాకర్లో భద్రపరిచారు. ఈ క్రమంలో తిరువారూరు కోర్టులో జరిగే విచారణ కోసం ఈ లాకర్ తెరచి చూడగా 18.5 కిలోల బంగారంలో 15 కిలోల బంగారం అదృశ్యమైంది. దీనిపై కంటోన్మెంట్ పోలీసులు గత 19వ తేదీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గత 24వ తేదీ డీఎస్పీ నేతృత్వంలో 16 మందితో కూడిన సీబీఐ బృందం తిరుచ్చి కస్టమ్స్ కార్యాలయంలో విచారణ చేశారు. అలాగే విమానాశ్రయంలో పని చేస్తున్న కస్టమ్స్ కార్యాలయ అధికారులు ఇళ్లలో తనిఖీ చేశారు. బంగారం స్వాధీనం చేసుకుని తిరువారూరులో విచారణ చేశారు. దీంతో బంగారం అదృశ్యమైన లాకర్, లాకర్లో వున్న గదులకు, ఈ గదులకు వెళ్లు మార్గాలకు సీల్ పెట్టారు. తరువాత సంవత్సరం రోజులుగా ఎవరెవరి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారో వారి వద్ద అధికారులు విచారణ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బంగారం అదృశ్యమైన లాకర్ నుంచి మరో 15 కిలోల బంగారం అదృశ్యమైనట్టు ఫిర్యాదులు అందాయి. ఇంతకుమునుపు పని చేసిన అధికారులు, ఉద్యోగులను విచారణ చేస్తున్నారు. -
యువతరం కదిలింది.. ఊరంతా కలిసొచ్చింది
పంచ భూతాలు... మనిషి జీవనాన్ని శాసిస్తాయి. వాటిలో ఏది లేకున్నా ఒక్క క్షణం కూడా ఈ భూమిపై ప్రాణి బతకలేదు. ఈ విషయం తెలిసి కూడా వాటిని ప్రత్యక్షంగా, పరోక్షంగా నాశనం చేస్తున్నాం. అయితే వాటిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న వారూ ఉన్నారు. ఏ అధికారులు చెప్పకుండానే, ఎవరూ నిధులు ఇవ్వకుండానే, ఏ ప్రభుత్వం సాయం లేకుండానే... కనుమరుగవుతున్న ఓ చెరువుకు జీవం పోస్తున్న కొందరు మంచి మనుషుల కథ ఇది. అది తమిళనాడులోని మావడిపట్టి గ్రామం. పక్కనే 143 ఎకరాల సువిశాలమైన చెరువు. కొన్నేళ్ల క్రితం వరకు ఎపుడూ కళకళలాడుతూ ఉండేది. ఆ చెరువులో నీరుండటం అంటే పంటలు పండించే రైతులకు మాత్రమే ఆనందం కాదు. దాహంతో ఉన్న పశువులకు ఆనందం. గేలంతో సరదాగా చేపల వేటకు వెళ్లే పిల్లలకు ఆనందం. జలకాలాడే యువకులకు ఆనందం. ఊరికి అందాన్ని తెచ్చే పక్షులకు ఆనందం... మొత్తం ఊరికే ఓ అందం. అయితే తిరుచ్చి సమీపంలోని మావడిపట్టి గ్రామానికి కొన్నేళ్లుగా ఈ ఆనందాలు లేవు. ఎందుకంటే ఆ విశాలమైన చెరువు కుంచించుకుపోయింది. మురికి గుంటగా మారింది. దాంతో గతంలో ఆ చెరువులో చేరే నీటిలో పదో వంతు కూడా నీరు చేరడం లేదు. ఇది ఆ ఊరిలో ఎందరిని కదిలించిందో తెలియదు గాని పక్కనే ఉన్న తిరుచ్చి నగరంలో కొందరు యువకులను మాత్రం కదిలించింది. తిరుచ్చి పట్టణ ప్రజలకు ఆ చెరువు ఒక లీజర్ స్పాట్. మరి అలాంటి వాతావరణం ఒకటి లేకపోవడాన్ని కొందరు యువకులు అస్సలు ఊహించుకోలేకపోయారు. అలాంటి వారికి వినోద్‌రాజ్ శేషన్ నాయకత్వం వహించారు. వారంతా కలిసి మావడిపట్టు గ్రామ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఇది మన చెరువు. ఇది మన ఆస్తి. దీన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆ ఊరి గురించి పక్క ఊరి వారికే ఆసక్తి ఉన్నపుడు ఊరిలోని వారికి ఉండదా? ఊరంతా కదిలింది. ముందు చెరువులో ఉన్న చెత్తను ఏరివేసే పని మొదలుపెట్టారు. ఎవరికి ఏది తోస్తే అది చేయకుండా ఒక పద్ధతిని ఎంచుకున్నారు. ‘తన్నీరు’ (తమిళంలో నీరు) అనే పేరుతో వాలంటరీ కమిటీ ఏర్పాటుచేశారు. చెరువు పునరుద్ధరణ పనులకు వచ్చే వారంతా ఇందులో సభ్యులుగా చేరాలి. ప్రతి ఆదివారం చెరువులో పూడికతీత/పునరుద్ధరణ పనులుంటాయి. ఏ వైపు ఎక్కడ ఎవరు ఏ పనిచేయాలి అన్నదానిని ప్రతి ఆదివారం ఉదయాన్నే అరగంట చర్చించుకుని పనిమొదలుపెడతారు. ఆ రోజంతా పది గంటల పాటు సాయంత్రం ఐదు వరకు పని కొనసాగుతుంది. 2013 జులై 14న ప్రారంభమైన ఈ స్వచ్ఛంద పునరుద్ధరణ పనులకు ఇతర ప్రాంతాల ప్రజల నుంచి కూడా అభినందనలు వచ్చాయి. వార్తల్లో చూసి ఇందులో స్వయంగా పాలుపంచుకున్న వాలంటీర్లు కూడా ఉన్నారు. మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న తిరుచ్చి జిల్లా కలెక్టర్ మురళీధరన్ జయశ్రీ స్వయంగా చెరువు వద్దకు వచ్చారు. నడుం బిగించి కేవలం పది నిమిషాల విరామంతో ఏకధాటిగా నాలుగ్గంటలు మట్టిని తవ్వి, మోసి వెళ్లారు. వలంటీర్లలో ఉత్సాహం నింపడానికి, ప్రజల్లో ఆసక్తిని పెంచడానికి ఆమె ఈ చొరవ తీసుకున్నారు. అంతేకాదు, సంబంధిత విభాగాల వారందరికీ ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించాలని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికి ఏడాది గడిచింది. ఇంకా పనులు కొనసాగుతున్నాయి. చాలా మంచి స్పందన వస్తోంది. ‘తన్నీరు’ స్ఫూర్తితో తిరుచ్చి సమీపంలో ఇతర ప్రాంతాల్లోనూ కదలిక వస్తోంది. తిరుచ్చిలోనైతే పూడిక తీత కార్యక్రమాలు చేపట్టి జలవనరుల సంరక్షణకు ముందుకు వస్తున్న యవకుల ప్రయత్నానికి సహకరిస్తూ అక్కడి అధికారులు ఆ చెరువులోని ఆక్రమణలన్నీ తొలగించేశారు. పలు కాలేజీలు తమ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంను ఈ చెరువులో చేయించి సహకరిస్తున్నాయి. -
19న రాష్ట్రపతి రాక
ప్యారిస్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 19వ తేదీ తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానం ద్వారా తంజావురు వైమానిక దళ విమానాశ్రయానికి వస్తున్నారు. అక్కడి నుంచి కారులో తంజావూరులో ఉన్న పున్నైనల్లూర్ మారియ మ్మ ఆలయానికి వెళ్లి మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం కారులో మళ్లీ తంజావూరు వైమానిక దళ విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా తిరువారూర్‌కు బయలుదేరి వెళతారు. అక్కడ జరగనున్న రాష్ట్ర సెంట్రల్ యూనివర్సిటీ కొత్త భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఆయన తిరుచ్చికి వచ్చి ఎన్ఐటీ గోల్డన్ జూబ్లీ ఉత్సవాల ముగింపోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ రాకను పురస్కరించుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టనున్నారు.