కస్టమ్స్ కార్యాలయంలో 'మళ్లీ' బంగారం మాయం
తిరువొత్తియూరు: తిరుచ్చి కస్టమ్స్ కార్యాలయంలో మరో 15 కిలోల బంగారం మాయం అయినట్టు సమాచారం బయటకు పొక్కడంతో బంగారం స్వాధీనం చేసుకునే అధికారుల వద్ద సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. విదేశాల నుంచి విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి అక్రమంగా తీసుకొచ్చే బంగారం, ఖరీదైన వస్తువులను ఇలాగే సముద్రమార్గంగా అక్రమంగా తీసుకొచ్చే బంగారాన్ని రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు కస్ట మ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని తిరుచ్చి విలియమ్స్ రోడ్డులో ఉన్న కస్టమ్స్, పన్ను వసూలు కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తారు.
గత సంవత్సరం తిరువారూరులో స్వాధీనం చేసుకున్న 18.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ లాకర్‌లో భద్రపరిచారు. ఈ క్రమంలో తిరువారూరు కోర్టులో జరిగే విచారణ కోసం ఈ లాకర్ తెరచి చూడగా 18.5 కిలోల బంగారంలో 15 కిలోల బంగారం అదృశ్యమైంది. దీనిపై కంటోన్మెంట్ పోలీసులు గత 19వ తేదీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గత 24వ తేదీ డీఎస్పీ నేతృత్వంలో 16 మందితో కూడిన సీబీఐ బృందం తిరుచ్చి కస్టమ్స్ కార్యాలయంలో విచారణ చేశారు. అలాగే విమానాశ్రయంలో పని చేస్తున్న కస్టమ్స్ కార్యాలయ అధికారులు ఇళ్లలో తనిఖీ చేశారు. బంగారం స్వాధీనం చేసుకుని తిరువారూరులో విచారణ చేశారు.
దీంతో బంగారం అదృశ్యమైన లాకర్, లాకర్‌లో వున్న గదులకు, ఈ గదులకు వెళ్లు మార్గాలకు సీల్ పెట్టారు. తరువాత సంవత్సరం రోజులుగా ఎవరెవరి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారో వారి వద్ద అధికారులు విచారణ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బంగారం అదృశ్యమైన లాకర్ నుంచి మరో 15 కిలోల బంగారం అదృశ్యమైనట్టు ఫిర్యాదులు అందాయి. ఇంతకుమునుపు పని చేసిన అధికారులు, ఉద్యోగులను విచారణ చేస్తున్నారు.