ప్రపంచానికి పాఠాలు చెబుతోంది | Tiruchi Girl is telling lessons to the world | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి పాఠాలు చెబుతోంది

Published Sun, Jun 20 2021 1:15 AM | Last Updated on Sun, Jun 20 2021 1:15 AM

Tiruchi Girl is telling lessons to the world - Sakshi

చీచదువుకుంటూ ట్యూషన్‌ చెప్పేవాళ్లు కొత్త కాదు. ఆన్‌లైన్‌ ట్యూషన్లు చెప్పడం కూడా కొత్త కాదు. కాని తిరుచ్చికి చెందిన బి.టెక్‌ విద్యార్థిని భారతీయులకు కాకుండా ప్రపంచ విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. లండన్, న్యూజిలాండ్, సింగపూర్, అమెరికా జాతీయులు ఆమె పాఠాలకు డాలర్లు పే చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో తన చదువు తాను చదువుకుంటూనే మంచి సంపాదనలో ఉన్న కె.విశ్వతిక మీరూ ఇలా చేయొచ్చని చెబుతోంది.

తిరుచ్చిరాపల్లిలోని తన ఇంటిలోని గదిలో సాయంత్రం ఆరు తర్వాత విశ్వతిక ల్యాప్‌టాప్‌ తెరుస్తుంది. ఆ వెంటనే ఆమె ఆన్‌లైన్‌ ట్యూషన్లు మొదలవుతాయి. విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అవుతూ ఆమె వారికి పాఠాలు చెబుతుంది. డౌట్లు క్లియర్‌ చేస్తుంది. వారు భారతీయులు కాదు. వారి ఇంగ్లిష్‌ ఉచ్చారణ వేరు. అయినప్పటికీ తనకొచ్చిన ఇంగ్లిష్‌తోనే వారిని ఆకట్టుకుంటూ ‘మాకూ పాఠాలు చెప్పు’ అనేంత డిమాండ్‌ తెచ్చుకుంది విశ్వతిక.

మేనకోడలితో మొదలు
విశ్వతిక బెంగళూరులోని సి.ఎం.ఆర్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదువుతోంది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల గత సంవత్సరం నుంచి తన స్వస్థలం అయిన తిరుచ్చి (తమిళనాడు)లోనే ఉంటూ చదువుకుంటోంది. అయితే ఆమె మేనకోడలు కాలిఫోర్నియాలో స్కూలు విద్యార్థిని. ‘నాకు ఆన్‌లైన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠాలు చెప్పవా’ అని అడిగితే సరేనని సరదాగా మొదలెట్టింది. కాని ఆ మేనకోడలు ఎంత ఇంప్రెస్‌ అయ్యిందంటే తన మేనత్తను విపరీతం గా మెచ్చుకోసాగింది ఆమె టీచింగ్‌ పద్ధతికి. ‘నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్‌ ఇష్టం. నేను బాగానే పాఠాలు చెబుతున్నానని నా మేనకోడలి వల్ల అర్థమైంది’ అని విశ్వతిక అంది. ఆ ఆత్మవిశ్వాసంతో ఆమె ఒక ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ట్యూషన్‌ టీచర్‌గా తన పేరు నమోదు చేసుకుంది. ఆక్కడి నుంచి ఆమె జీవిత పాఠమే మారిపోయింది.

బ్రిటిష్‌ విద్యార్థి ప్రచారం
ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా విశ్వతికకు నాలుగో తరగతి చదువుతున్న ఆలియా అనే పదేళ్ల బ్రిటిష్‌ విద్యార్థిని మొదటిసారిగా ట్యూషన్‌కు వచ్చింది. పైథాన్‌ అనే కోడింగ్‌ ప్రోగ్రామ్‌ గురించి పాఠాలు నేర్చుకుంది. ఆలియాకు విశ్వతిక పద్ధతి నచ్చి లండన్‌లో ఉన్న తన ఫ్రెండ్స్‌ చాలామందికి విశ్వతిక గురించి చెప్పింది. ‘అందరూ కోడింగ్‌ ప్రోగ్రామ్స్‌తో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేథమేటిక్స్‌లో ట్యూషన్లకు చేరడం మొదలెట్టారు’ అంది విశ్వతిక. నెమ్మదిగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి విశ్వతిక పేరు ప్రచారం కాసాగింది. ప్రస్తుతం ఆమెకు విదేశాలలో 20 మంది స్టూడెంట్స్‌ ఉన్నారు. మరికొందరు లైన్‌లో ఉన్నారు. ఆమె పాఠాలకు డాలర్లకు పే చేస్తున్నారు. ‘నేను సందేహాలు తీరుస్తూ పాఠాలు చెబుతాను. అది అందరికీ నచ్చుతోంది’ అంటోంది విశ్వతిక.

ఇంగ్లిష్‌ నేర్చుకుని
విశ్వతిక కంప్యూటర్‌ చదువులో మంచి తెలివున్న విద్యార్థిని. ప్రోగ్రామ్స్‌ రాస్తుంది. అలాగే ఇంగ్లిష్‌ కూడా ముఖ్యమని తెలుసు. అందుకే చెన్నై బ్రిటిష్‌ కౌన్సిల్‌ నుంచి షార్ట్‌టర్మ్‌ కోర్సు చేసింది. ‘అయితే వివిధ దేశాలలోని విద్యార్థుల ఉచ్చరణ నా ఉచ్చరణ వేరు. అయితే అది నా పాఠాలకు అడ్డు కాలేదు’ అంటుంది విశ్వతిక. ఆమె గట్టిగా 20 దాటలేదు. ఇప్పటికే రెండు ఫార్మసూటికల్‌ సంస్థల కోసం సాఫ్ట్‌వేర్‌ తయారు చేసి ఇచ్చింది. అంతేనా? ఆరు మంది ఎం.బి.ఏ గ్రాడ్యుయేట్స్‌ను తన ప్రాడక్ట్స్‌ అమ్మేందుకు ఉద్యోగులుగా కూడా పెట్టుకుంది.

‘ఆన్‌లైన్‌ క్లాసులకు చాలా భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో గుర్తింపు పొందిన ఆన్‌లైన్‌ స్కూళ్లు వస్తాయి. విద్యార్థులు వాటిలో చదువుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న స్కూళ్లు ఇక మీదట పిల్లలు కేవలం కంప్యూటర్లలోనే చూస్తారు’ అని జోస్యం చెబుతోంది విశ్వతిక.

తెలివి ఒకరి సొత్తు కాదు. ఉన్న తెలివిని ఉపయోగించే మార్గాలు కొత్తగా అన్వేషించడమే మన పని అని దారి చూపుతోంది విశ్వతిక.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement