
ఢిల్లీ: వరదలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరభారతానికి ఇంకా ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పషం చేసింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదుల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ వేగానికి బ్రిడ్జిలు కుప్పకూలిపోతున్నాయి. పలు భవనాలు నీటమునిగాయి. నగరాలు నుంచి పల్లెలదాక కాలనీలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరో రెండు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎమ్‌డీ హెచ్చరికలు జారీ చేసింది. నదీ ప్రవాహాలకు దగ్గరగా వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. దేశ రాజధానిలో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం.
ఇదీ చదవండి: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..