అది 1947.. ఆగస్టు 15.. భారతదేశం బ్రిటీషర్ల బానిసత్వం నుంచి విముక్తి పొందింది. 200 ఏళ్లుగా బ్రిటిష్ పాలనకు చిహ్నంగా ఉన్న యూనియన్ జాక్ జెండా అవనతం అయ్యింది. భారత జాతీయ జెండా రెపరెపలాడింది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తొలిసారిగా స్వతంత్ర భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవాన భారత ప్రధాని ఎర్రకోట ప్రాకారాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇక్కడి నుంచి అత్యధికంగా 17 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు.
అయితే స్వతంత్ర భారతంలో ఇద్దరు ప్రధానులు తమ హయాంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోయారు. మాజీ ప్రధానలు గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్ ఈ జాబితాలో ఉన్నారు. గుల్జారీలాల్ నందా 13 రోజుల చొప్పున రెండుసార్లు ప్రధాని అయ్యారు.
1964 మే 27 నుండి జూన్ 9 వరకు మొదటిసారి, 1966 జనవరి 11 నుండి జనవరి 24 వరకు రెండవసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని చంద్రశేఖర్ విషయానికొస్తే ఆయన 1990 నవంబర్ 10 నుండి 1991, జూన్ 21 వరకు 8 నెలల పాటు ప్రధానిగా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ వీరిద్దరి పాలనా కాలాలలో రాకపోవడంతో వీరికి ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment