
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు పెరిగిపోతున్న అపరిష్కృత (పెండింగ్) కేసుల విషయంలో ప్రభుత్వంతోపాటు, కోర్టులు, న్యాయ మంత్రిత్వ శాఖలు దృష్టిసారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని స్థాయిల్లో 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండటం విచారకరమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయకళాశాల (ఆంధ్రయూనివర్సిటీ) 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వెబినార్‌లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసులపై ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల సంఖ్య పెరుగుతున్నందున కీలకమైన కేసుల్లో తీర్పు కూడా ఆలస్యమవుతోందన్నారు. తద్వారా సామాన్యులకు న్యాయప్రక్రియ చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అన్న మాటను ప్రస్తావిస్తూ.. కొన్ని సందర్భాల్లో అనవసరంగా కేసులను పొడగించడం, వాయిదా వేయడం జరుగుతోందని చెప్పారు. ఈ విషయంపై న్యాయవాదులతోపాటు ఈ రంగంతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముందన్నారు. (ఆ రెండు యాప్‌లు ప్లే స్టోర్ నుంచి మాయం! )
దీంతోపాటు క్లిష్టమైన చట్టాలను సరళీకృతం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వినియోగంలో లేని 1600కు పైగా చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని గుర్తుచేశారు. చట్టాల రూపకల్పన కూడా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా, స్పష్టంగా ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) ఇటీవల ప్రయివేటు (వ్యక్తిగత) ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. దీని వల్ల న్యాయస్థానాల విలువైన సమయాన్ని వ్యర్థం చేసినట్లే అవుతుందన్నారు. సమాజంలోని పేద, అణగారినవర్గాలకు న్యాయపరమైన సహాయం చేయాలని, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషిచేయాలని లా విద్యార్థులకు, యువ న్యాయవాదులకు ఉపరాష్ట్రపతి సూచించారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో న్యాయవాదుల పాత్ర కీలకమనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ టి.రజని, జస్టిస్ బట్టు దేవానంద్, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి సహా పలువురు న్యాయకోవిదులు, న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు పాల్గొన్నారు. (‘ముంబై మానవత్వం కోల్పోయింది’)
Comments
Please login to add a commentAdd a comment