సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో సంభవించిన విద్యుదాఘాత ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అనూహ్య ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాక్షించారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు.
కాగా, చమోలీ జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న చమోలీ బ్రిడ్జిపై ట్రాన్స్‌ఫార్మర్ పేలి విద్యుత్ ప్రసరించింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవారికి షాక్ తగిలి 16 మంది ప్రాణాలు విడిచారు. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
(దంచికొట్టిన వాన.. గంటల్లోనే 30 సెం.మీ వర్షం.. రిజర్వాయర్లకు హై అలర్ట్)
మృతుల్లో ముగ్గురు గార్డులు, ఒక పోలీసు వ్యక్తి కూడా ఉన్నారు. కళ్లముందే కరెంట్ షాక్‌తో అంతమంది విగతజీవులుగా మారడం స్థానికంగా భయోత్పాతం సృష్టించింది. తీవ్రంగా గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
సీఎం విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
చమోలీ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులకు రూ.1 లక్ష చొప్పున అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. సత్వర విచారణ చేపట్టాలని ఆదేశించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సీఎం ధామితో ఫోన్‌లో మాట్లాడారు. చమోలీ ఘటనపై ఆరా తీశారు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
(డిప్యూటీ స్పీకర్‌పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..)
Comments
Please login to add a commentAdd a comment