మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి, మనకు ఎంతో హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా జీవరాశుల మరణానికి కారణంగా మారుతున్నాయి. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి వినియోగించేలా రీసైకిల్ చేసేందుకు విరివిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ముందడుగు వేసిన తమిళనాడులోని మదురైలోగల టీసీఈ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రపంచమంతటా రోడ్లు వేయాలనే ఆలోచనను అందించారు. ఫలితంగా ఆయన ‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందారు. అతని కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను రూపొందించిన ఈ ప్రొఫెసర్ పేరు రాజగోపాలన్ వాసుదేవన్. మధురైలోని టీసీఈ ఇంజినీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2002 సంవత్సరంలో త్యాగరాజర్ కళాశాల ఆవరణలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని నిర్మించడంలో వాసుదేవన్ తొలిసారి విజయం సాధించారు. వాసుదేవన్ చేస్తున్న కృషికి గుర్తింపు రావడానికి చాలా కాలం పట్టింది. దాదాపు పదేళ్ల కృషి అనంతరం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత వద్దకు తన ప్రాజెక్టు తీసుకెళ్లడంతో ఈ సాంకేతికతకు గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. జయలలిత తన కృషిని మెచ్చుకున్నారని, సహాయం చేయడానికి ముందుకు వచ్చారని వాసుదేవన్ తెలియజేశారు.
వాసుదేవన్ తన ఆలోచనను ప్రపంచంతో పంచుకోవడంతో, దీనిని అతని నుంచి దక్కించుకునేందుకు పలువురు ప్రయత్నించారు. అయితే ఇందుకు వాసుదేవన్ నిరాకరించారు. తన సాంకేతికతను ఆయన ఉచితంగా భారత ప్రభుత్వానికి అప్పగించారు. ఫలితంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మితమయ్యాయి. వాసుదేవన్ తయారు చేసిన ఈప్రాజెక్టు కొనుగోలుకు అమెరికా సుమారు రూ. 1400 కోట్లు ఆఫర్ చేసిందని అంటారు. అయితే అతను ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. తన ఈ ఆవిష్కరణను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందించారు. ఫలితంగా దేశంలో రోడ్ల నిర్మాణంలో విప్లవం వచ్చింది.
వాసుదేవన్ అందించిన సాంకేతికతను నేడు పంచాయతీలు, మునిసిపాలిటీలు సైతం ఉపయోగిస్తున్నాయి. అలాగే రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా పెద్ద ఎత్తున వ్యర్థ ప్లాస్టిక్‌ను ఉపయోగించాలనే మిషన్‌ను ప్రారంభించింది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 26 వేల మందిని అనుసంధానం చేసి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించి, రోడ్డు నిర్మాణంలో వినియోగించేందుకు అనువుగా వ్యర్థ ప్లాస్టిక్‌ను సేకరిస్తున్నారు.
వివిధ దేశాలకూ వాసుదేవన్ సాంకేతికత
భారతదేశంలో ఇప్పటికే దాదాపు 100,000 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రోడ్లు తయారయ్యాయి. పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. భారతదేశంలోనే కాదు వాసుదేవన్ అందించిన సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అమలు చేస్తున్నాయి. ఇండోనేషియాలో బాలి, సెర్బియా, బెకాసి, మకస్సర్ తదితర ప్రదేశాలతో ప్లాస్టిక్-తారు మిశ్రమాలను ఉపయోగించి ప్లాస్టిక్ రోడ్లు నిర్మితమవుతున్నాయి. నెదర్లాండ్స్ ఈశాన్య భాగంలో సైక్లిస్టుల కోసం డచ్ కంపెనీ వెర్కర్ సెల్.. ప్లాస్టిక్ రోడ్లు నిర్మించింది. ఈ క్రమంలో ప్లాస్టిక్ రోడ్ టెక్నాలజీని పరీక్షించేందుకు యునైటెడ్ కింగ్‌డమ్ 1.6 మిలియన్ పౌండ్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజగోపాలన్ వాసుదేవన్ ప్రతిభను ప్రపంచం మెచ్చుకుంటోంది.
ఇది కూడా చదవండి: ఈ నగరంలో నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి?
Comments
Please login to add a commentAdd a comment