సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వైద్యాన్ని చౌకగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సరైన సమయంలో వైద్యం అందించడాన్ని సైతం ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానికసంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్ రంగం సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం వైద్య కళాశాల స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.
మహిళలకు సరైన ప్రోత్సాహం అందించాలి
దేశంలో వైద్యం మరింత ఖరీదవుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ భారాన్ని మోయలేకపోతున్న విషయాన్ని ప్రతీ ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్నాతకోత్సవంలో పతకాలు అందుకున్న వారిలో ఎక్కువమంది యువతులు ఉండటాన్ని ప్రత్యేకంగా అభినందించిన వెంకయ్యనాయుడు... మహిళలకు సరైన ప్రోత్సాహాన్నందిస్తే ఏదైనా సాధించగలరనే దానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు.
కరోనాపై పోరాటంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా వైద్యులు, వైద్య సిబ్బంది పోషించిన పాత్రను సమాజం ఎన్నటికీ మరిచిపోదన్నారు. అయితే దేశంలో వైద్యులు, రోగుల నిష్పత్తి మధ్య ఉన్న భారీ అంతరాన్ని తగ్గించేందుకు కృషి జరగాలని సూచించారు.
వలసవాద విధానాలు విడనాడాలి
ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ, తత్సంబంధిత ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రానున్న రోజుల్లో ప్రతి రెవెన్యూ కేంద్రానికి ఒక సకల సౌకర్యాలున్న ఆసుపత్రి ఏర్పాటు జరగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. వైద్యరంగం అత్యంత పవిత్రమైన వృత్తుల్లో ఒకటన్న ఉపరాష్ట్రపతి, వైద్య విద్యార్థులు విధుల్లో చేరిన తర్వాత తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా పనిచేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంలో, అక్కడి ప్రజలకు వైద్యం అందించడంలో చొరవ తీసుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ కొన్ని వలసవాద విధానాలను కొనసాగించడంపై వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన విధానాలను, మన అలవాట్లను భారతీయీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు.
చట్టసభలు, విద్య, పరిపాలన, న్యాయ ఇలా అన్నిరంగాల్లోనూ భారతీయ విధానాలను అలవర్చుకోవాలన్నారు. న్యాయవ్యవస్థను జాతీయీకరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment