న్యూఢిల్లీ: విజిలెన్స్ కమిషనర్ సురేశ్ ఎన్ పటేల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సీవీసీ పోస్ట్ ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. సంజయ్ కొఠారీ పదవీ కాలం పూర్తి కావడంతో సురేశ్ ఎన్ పటేల్ జూన్ నుంచి తాత్కాలిక సీవీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సురేశ్ ఎన్ పటేల్ పేరును గత నెలలోనే ఖరారు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఇద్దరు కమిషనర్ల పేర్లను హోం మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. సీవీసీగా బాధ్యతలు చేపట్టిన సురేశ్ ఎన్ పటేల్ అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ చీఫ్ అర్వింద్ కుమార్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవలతో విజిలెన్స్ కమిషనర్లుగా ప్రమాణం చేయించారు.
సీవీసీ, ఇద్దరు కమిషనర్ల నియామకంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇక పూర్తి స్థాయిలో పనిచేయనుంది. ఆంధ్రా బ్యాంక్ మాజీ చీఫ్ అయిన సురేశ్ ఎన్ పటేల్ 2020 ఏప్రిల్‌లో విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, 1984 బ్యాచ్ రిటైర్డు ఐపీఎస్ అధికారి అయిన అర్వింద్ కుమార్ 2019–22 సంవత్సరాల్లో ఐబీ డైరెక్టర్‌గా ఉన్నారు. అస్సాం–మేఘాలయ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన శ్రీవాస్తవ కేబినెట్ సెక్రటరీగా పనిచేశారు. సీవీసీ, విజిలెన్స్ కమిషనర్‌లు నాలుగేళ్లపాటు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవుల్లో కొనసాగుతారు.
Comments
Please login to add a commentAdd a comment