Sanjay Kothari
-
నూతన సీవీసీ సురేశ్ ఎన్ పటేల్
న్యూఢిల్లీ: విజిలెన్స్ కమిషనర్ సురేశ్ ఎన్ పటేల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్లో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సీవీసీ పోస్ట్ ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. సంజయ్ కొఠారీ పదవీ కాలం పూర్తి కావడంతో సురేశ్ ఎన్ పటేల్ జూన్ నుంచి తాత్కాలిక సీవీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సురేశ్ ఎన్ పటేల్ పేరును గత నెలలోనే ఖరారు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఇద్దరు కమిషనర్ల పేర్లను హోం మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. సీవీసీగా బాధ్యతలు చేపట్టిన సురేశ్ ఎన్ పటేల్ అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ చీఫ్ అర్వింద్ కుమార్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవలతో విజిలెన్స్ కమిషనర్లుగా ప్రమాణం చేయించారు. సీవీసీ, ఇద్దరు కమిషనర్ల నియామకంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇక పూర్తి స్థాయిలో పనిచేయనుంది. ఆంధ్రా బ్యాంక్ మాజీ చీఫ్ అయిన సురేశ్ ఎన్ పటేల్ 2020 ఏప్రిల్‌లో విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, 1984 బ్యాచ్ రిటైర్డు ఐపీఎస్ అధికారి అయిన అర్వింద్ కుమార్ 2019–22 సంవత్సరాల్లో ఐబీ డైరెక్టర్‌గా ఉన్నారు. అస్సాం–మేఘాలయ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన శ్రీవాస్తవ కేబినెట్ సెక్రటరీగా పనిచేశారు. సీవీసీ, విజిలెన్స్ కమిషనర్లు నాలుగేళ్లపాటు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవుల్లో కొనసాగుతారు. -
సీవీసీగా సంజయ్ కొఠారి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి కోవింద్ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కొఠారి(63) సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. శనివారం ఉదయం కొరాఠీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు పాల్గొన్నారు. 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కొఠారి, హరియాణా కేడర్‌కు చెందిన వారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయన 2016లో పదవీ విరమణ చేశారు. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థల పదవుల ఎంపిక బోర్డు(పీఈఎస్బీ)కు చైర్మన్‌గా నియమితులయ్యారు. 2017లో రాష్ట్రపతి కోవింద్‌కు కార్యదర్శిగా ఎంపికయ్యారు. సీవీసీగా ఆయన 2021 జూన్ వరకు కొనసాగుతారు. కొఠారీ నియామకంతో ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ‘సీవీసీ నియామక విధానాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆ పదవికి దరఖాస్తు కూడా చేసుకోని, ఎంపిక కమిటీ పరిశీలించని వ్యక్తిని నియమించింది. సీవీసీ పదవికి ఎంపిక ప్రక్రియ మళ్లీ చేపట్టాలి’అని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. ప్రధాని నేతృత్వంలోని హోం మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేత సభ్యులుగా ఉండే కమిటీ సీవీసీని ఎంపిక చేయడం ఆనవాయితీ. సీవీసీ పదవీ కాలం నాలుగేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఉంటారు. సీవీసీ కేవీ చౌదరి గత ఏడాది జూన్‌లో రిటైరైనప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. కాగా, రాష్ట్రపతి కోవింద్ కార్య దర్శిగా పీఈఎస్బీ చైర్మన్ కపిల్ దేవ్ త్రిపాఠీని ఈనెల 20నే కేంద్రం నియమించింది. -
నూతన సీవీసీగా కొఠారి
న్యూఢిల్లీ: నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్ కొఠారి నియామకం కానున్నారు. ఈమేరకు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఏర్పా టు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న బిమల్ జుల్కాను కేంద్ర సమాచార కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) గా ఎంపికచేశారు. వీరిద్దరూ ఐఏఎస్ అధికారులుగా పదవీవిరమణ పొందినవారే. వీరి నియామకాన్ని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధరి వ్యతిరేకించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తర్వాత ఈ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. -
రాష్ట్రపతి కార్యదర్శిగా సంజయ్ కొఠారీ
న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కేంద్రం కొత్తగా సహాయక సిబ్బందిని నియమించింది. ఇందులో భాగంగా రాష్ట్రపతి కార్యదర్శిగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్బీ) చైర్మన్ సంజయ్ కొఠారీని, ప్రెస్ కార్యదర్శిగా సీనియర్ పాత్రికేయుడు అశోక్ మాలిక్‌ను కేంద్రం నియమించింది. గుజరాత్ కేడర్‌కు చెందిన సీనియర్ అటవీ శాఖ అధికారి భరత్ లాల్‌ను సంయుక్త కార్యదర్శిగాను నియమించింది. ఈమేరకు కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శిక్షణ విభాగం శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. వీరి నియామకాన్ని ప్రధాని అధ్యక్షతన ఉండే కేబినెట్ నియామక కమిటీ కూడా వెంటనే ఆమోదించింది. కొత్తగా నియమితులైన వీరు రెండేళ్లపాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. -
అడిగితే చేద్దామనుకోవడం సరికాదు
♦ రాష్ట్రానికి పూర్తిస్థాయి సహకారం అందడంలేదు ♦ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కొఠారితో సీఎం చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధికి ఆశించిన స్థాయిలో కేంద్ర సాయం అందడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన చట్టంలో చెప్పిన ప్రత్యేక హోదా రాలేదని, అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయి సహకారం అందడంలేదన్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ, విభజన చట్టం అమలు తీరును పరిశీలించడానికి బుధవారం హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయానికి వచ్చిన సంజయ్‌తో చంద్రబాబు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు, మౌలిక వసతులు లేవని, ఉన్నత విద్యా వైజ్ఞానిక పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. వీటిన్నింటికీ కేంద్ర సహకారం అవసరమని, ఈ విషయాన్ని కేంద్రానికి తెలపాలని కోరారు. అడిగితేనే చేద్దామనే వైఖరి సరికాదని, ఉద్యోగుల విభజన ప్రక్రియనైనా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ సమన్యాయం లేకుండా, విచక్షణారహితంగా రాష్ట్రాన్ని విభజించి భారీ మూల్యాన్ని చెల్లించుకుందన్నారు. చేస్తామని చెప్పిన టీడీపీ-బీజేపీకి ప్రజలు అధికారమిచ్చారని ఎన్నికల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు. ఉన్నత విద్యా సంస్థలు, కేంద్రీయ విద్య, పరిశోధనా సంస్థలు హైదరాబాద్‌లోనే ఉండడంతో వాటిని కోల్పోవాల్సివచ్చిందన్నారు. రాజధాని నిర్మాణంతోపాటు వాటన్నింటినీ తిరిగి ఏపీలో ఏర్పాటు చేసుకోవాలంటే రూ.5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని ఎప్పటి నుంచో తాను చెబుతున్నానని తెలిపారు.