అడిగితే చేద్దామనుకోవడం సరికాదు
♦ రాష్ట్రానికి పూర్తిస్థాయి సహకారం అందడంలేదు
♦ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కొఠారితో సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధికి ఆశించిన స్థాయిలో కేంద్ర సాయం అందడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన చట్టంలో చెప్పిన ప్రత్యేక హోదా రాలేదని, అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయి సహకారం అందడంలేదన్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ, విభజన చట్టం అమలు తీరును పరిశీలించడానికి బుధవారం హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయానికి వచ్చిన సంజయ్‌తో చంద్రబాబు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు, మౌలిక వసతులు లేవని, ఉన్నత విద్యా వైజ్ఞానిక పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు.
వీటిన్నింటికీ కేంద్ర సహకారం అవసరమని, ఈ విషయాన్ని కేంద్రానికి తెలపాలని కోరారు. అడిగితేనే చేద్దామనే వైఖరి సరికాదని, ఉద్యోగుల విభజన ప్రక్రియనైనా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ సమన్యాయం లేకుండా, విచక్షణారహితంగా రాష్ట్రాన్ని విభజించి భారీ మూల్యాన్ని చెల్లించుకుందన్నారు. చేస్తామని చెప్పిన టీడీపీ-బీజేపీకి ప్రజలు అధికారమిచ్చారని ఎన్నికల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు. ఉన్నత విద్యా సంస్థలు, కేంద్రీయ విద్య, పరిశోధనా సంస్థలు హైదరాబాద్‌లోనే ఉండడంతో వాటిని కోల్పోవాల్సివచ్చిందన్నారు. రాజధాని నిర్మాణంతోపాటు వాటన్నింటినీ తిరిగి ఏపీలో ఏర్పాటు చేసుకోవాలంటే రూ.5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని ఎప్పటి నుంచో తాను చెబుతున్నానని తెలిపారు.