
న్యూఢిల్లీ: రాష్ట్రపతి కోవింద్ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కొఠారి(63) సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. శనివారం ఉదయం కొరాఠీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు పాల్గొన్నారు. 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కొఠారి, హరియాణా కేడర్‌కు చెందిన వారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయన 2016లో పదవీ విరమణ చేశారు. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థల పదవుల ఎంపిక బోర్డు(పీఈఎస్‌బీ)కు చైర్మన్‌గా నియమితులయ్యారు. 2017లో రాష్ట్రపతి కోవింద్‌కు కార్యదర్శిగా ఎంపికయ్యారు.
సీవీసీగా ఆయన 2021 జూన్ వరకు కొనసాగుతారు. కొఠారీ నియామకంతో ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ‘సీవీసీ నియామక విధానాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆ పదవికి దరఖాస్తు కూడా చేసుకోని, ఎంపిక కమిటీ పరిశీలించని వ్యక్తిని నియమించింది. సీవీసీ పదవికి ఎంపిక ప్రక్రియ మళ్లీ చేపట్టాలి’అని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. ప్రధాని నేతృత్వంలోని హోం మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేత సభ్యులుగా ఉండే కమిటీ సీవీసీని ఎంపిక చేయడం ఆనవాయితీ. సీవీసీ పదవీ కాలం నాలుగేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఉంటారు. సీవీసీ కేవీ చౌదరి గత ఏడాది జూన్‌లో రిటైరైనప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. కాగా, రాష్ట్రపతి కోవింద్ కార్య దర్శిగా పీఈఎస్‌బీ చైర్మన్ కపిల్ దేవ్ త్రిపాఠీని ఈనెల 20నే కేంద్రం నియమించింది.