Central Vigilance Commissioner
-
సీవీసీగా ప్రవీణ్ శ్రీవాస్తవ
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుత విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను సీవీసీగా నియమించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆయన రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేశారని, కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారని తెలిపింది. సీవీసీ సురేశ్ ఎన్ పటేల్ పదవీ కాలం గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయింది. అప్పటి నుంచి శ్రీవాస్తవ తాత్కాలిక సీవీసీగా కొనసాగుతున్నారు. సీవీసీగా 65 ఏళ్లు వచ్చే వరకు లేదా నాలుగేళ్ల కాలానికి బాధ్యతల్లో కొనసాగుతారు. 1988 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అయిన శ్రీవాస్తవ అస్సాం–మేఘాలయ కేడర్‌కు చెందిన వారు. గత ఏడాది జనవరి 31న కేబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు. సీవీసీ సారథ్యంలో విజిలెన్స్ కమిషన్‌లో గరిష్టంగా ఇద్దరు కమిషనర్లు ఉండొచ్చు. ఐబీ మాజీ చీఫ్ అర్వింద్ ఒక్కరే ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్నారు. మరో కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. -
నూతన సీవీసీ సురేశ్ ఎన్ పటేల్
న్యూఢిల్లీ: విజిలెన్స్ కమిషనర్ సురేశ్ ఎన్ పటేల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్లో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సీవీసీ పోస్ట్ ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. సంజయ్ కొఠారీ పదవీ కాలం పూర్తి కావడంతో సురేశ్ ఎన్ పటేల్ జూన్ నుంచి తాత్కాలిక సీవీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సురేశ్ ఎన్ పటేల్ పేరును గత నెలలోనే ఖరారు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఇద్దరు కమిషనర్ల పేర్లను హోం మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. సీవీసీగా బాధ్యతలు చేపట్టిన సురేశ్ ఎన్ పటేల్ అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ చీఫ్ అర్వింద్ కుమార్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవలతో విజిలెన్స్ కమిషనర్లుగా ప్రమాణం చేయించారు. సీవీసీ, ఇద్దరు కమిషనర్ల నియామకంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇక పూర్తి స్థాయిలో పనిచేయనుంది. ఆంధ్రా బ్యాంక్ మాజీ చీఫ్ అయిన సురేశ్ ఎన్ పటేల్ 2020 ఏప్రిల్‌లో విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, 1984 బ్యాచ్ రిటైర్డు ఐపీఎస్ అధికారి అయిన అర్వింద్ కుమార్ 2019–22 సంవత్సరాల్లో ఐబీ డైరెక్టర్‌గా ఉన్నారు. అస్సాం–మేఘాలయ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన శ్రీవాస్తవ కేబినెట్ సెక్రటరీగా పనిచేశారు. సీవీసీ, విజిలెన్స్ కమిషనర్లు నాలుగేళ్లపాటు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవుల్లో కొనసాగుతారు. -
సీవీసీగా సంజయ్ కొఠారి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి కోవింద్ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కొఠారి(63) సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. శనివారం ఉదయం కొరాఠీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు పాల్గొన్నారు. 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కొఠారి, హరియాణా కేడర్‌కు చెందిన వారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయన 2016లో పదవీ విరమణ చేశారు. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థల పదవుల ఎంపిక బోర్డు(పీఈఎస్బీ)కు చైర్మన్‌గా నియమితులయ్యారు. 2017లో రాష్ట్రపతి కోవింద్‌కు కార్యదర్శిగా ఎంపికయ్యారు. సీవీసీగా ఆయన 2021 జూన్ వరకు కొనసాగుతారు. కొఠారీ నియామకంతో ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ‘సీవీసీ నియామక విధానాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆ పదవికి దరఖాస్తు కూడా చేసుకోని, ఎంపిక కమిటీ పరిశీలించని వ్యక్తిని నియమించింది. సీవీసీ పదవికి ఎంపిక ప్రక్రియ మళ్లీ చేపట్టాలి’అని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. ప్రధాని నేతృత్వంలోని హోం మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేత సభ్యులుగా ఉండే కమిటీ సీవీసీని ఎంపిక చేయడం ఆనవాయితీ. సీవీసీ పదవీ కాలం నాలుగేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఉంటారు. సీవీసీ కేవీ చౌదరి గత ఏడాది జూన్‌లో రిటైరైనప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. కాగా, రాష్ట్రపతి కోవింద్ కార్య దర్శిగా పీఈఎస్బీ చైర్మన్ కపిల్ దేవ్ త్రిపాఠీని ఈనెల 20నే కేంద్రం నియమించింది. -
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ‘ఎక్స్‌లెన్స్’ అవార్డు
ఉక్కునగరం (గాజువాక)/ తిరుపతి రూరల్: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కార్పొరేట్ విజిలెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ) ఆధ్వర్యంలో అవినీతి నిరోధక నిఘా చర్యల్లో ప్రతిభ చూపే సంస్థలకు ప్రతి ఏటా ఈ అవార్డులను ఇస్తున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కాంక్లేవ్ ఆఫ్ విజిలెన్స్ ఆఫీసర్స్ సదస్సులో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి చేతుల మీదుగా స్టీల్ ప్లాంట్ చీఫ్ విజిలెన్స్ అధికారి బి.సిద్ధార్థకుమార్ ఈ అవార్డును అందుకున్నారు. డిస్కంకు విజిలెన్స్ అవార్డు: విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడంలో ప్రతిభ చూపిన దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)కు విజిలెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కింది. ఈ అవార్డును కేవీ చౌదరి చేతుల మీదుగా డిస్కం డీపీఈ సూపరింటెండింగ్ ఇంజనీర్ రవి, ప్లానింగ్ చీఫ్ జనరల్ మేనేజర్ సంగీతరావులు అందుకున్నారు. -
సీవీసీ చెడ్డ పదమేమీకాదు: కేవీ చౌదరి
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ పదం పట్ల చాలాకాలంగా ప్రజలు ఒకరకమైన భావనను కలిగి ఉన్నారని, కానీ, అదేమీ చెడ్డ పదం కాదని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ చౌదరి అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల సెమినార్లో ఆయన మాట్లాడారు. అక్రమాలకు దూరంగా ప్రతి సంస్థ ప్రణాళికాబద్ధంగా, ప్రమాణాల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. మంచి, చెడుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అవినీతికి పాల్పడితే పట్టించాలని కోరారు. -
సీవీసీగా కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాష్ట్రపతి భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా కేవీ చౌదరితో పాటు కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చీఫ్ కేవీ చౌదరిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా కేవీ చౌదరి (కొసరాజు వీరయ్య చౌదరి) కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామానికి చెందినవారు. 1954 అక్టోబర్ 10న జన్మించారు. తండ్రి కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు మచిలీపట్నంలో అడ్వకేట్‌గా పనిచేశారు. కేవీ చౌదరి ఇంటర్ వరకు కృష్ణా జిల్లాలోనే చదువుకున్నారు. బీఎస్సీ మేథమేటిక్స్ చెన్నైలోని లయోలా కాలేజీలో, ఎమ్మెస్సీ మేథమేటిక్స్ ఐఐటీ చెన్నైలో చదివారు. -
సీవీసీగా కేవీ చౌదరి
సీఐసీగా విజయ్ శర్మ నియామకం న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చీఫ్ కేవీ చౌదరిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా విజయ్ శర్మను నియమించింది. గతవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నియామకాల కమిటీ వీరిద్దరి పేర్లను ఖరారు చేయడం తెలిసిందే. వీరి నియామకాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారని రాష్ట్రపతి భవన్ ప్రతినిధి తెలిపారు. వీరిద్దరితో పాటు ఇండియన్ బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టీఎం భాసిన్‌ను విజిలెన్స్ కమిషనర్‌గా, సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి సుధీర్ భార్గవను సమాచార శాఖ కమిషనర్‌గా నియమించారు. అవినీతి నిఘా విభాగాల్లో కీలకమైన సీవీసీ పదవికి ఒక ఐఏఎస్ అధికారి కాని వారిని నియమించడం 1964 నుంచి ఇదే మొదటిసారి. ఇక సీఐసీ నియామకంలో సమాచార కమిషనర్లలో ఎక్కువ సీనియారిటీ ఉన్న కమిషనర్‌ను నియమించాలనే సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించింది. 2014 ఆగస్టు 22న సీఐసీ రాజీవ్ మాథుర్ పదవీకాలం ముగిసినప్పటి నుంచీ కూడా ప్రభుత్వం ఆ ఖాళీని భర్తీ చేయలేదు. ప్రధాన కమిషనర్ లేకుండా సీఐసీలో విచారణకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న కేసులు 40,051 ఉన్నాయి. కాగా సీఐసీలో ఖాళీగా ఉన్న మూడు కమిషనర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కురుముద్దాలి నుంచి ఢిల్లీ దాకా సాక్షి ప్రతినిధి, విజయవాడ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులైన కొసరాజు వీరయ్య చౌదరి కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామానికి చెందినవారు. 1954 అక్టోబర్ 10న జన్మించారు. తండ్రి కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు మచిలీపట్నంలో అడ్వకేట్‌గా పనిచేశారు. కేవీ చౌదరి ఇంటర్ వరకు కృష్ణా జిల్లాలోనే చదువుకున్నారు. బీఎస్సీ మేథమేటిక్స్ చెన్నైలోని లయోలా కాలేజీలో, ఎమ్మెస్సీ మేథమేటిక్స్ ఐఐటీ చెన్నైలో చదివారు. 1978 బ్యాచ్ ఐఆర్ఎస్కు చెందిన ఈయన కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం చైర్మన్‌గా పనిచేశారు.. బ్లాక్‌మనీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందంలో సభ్యుడిగా కూడా చౌదరి పనిచేశారు. ఈయన టూజీ కేసు విచారణలోనూ కీలక అధికారిగా పనిచేశారు. సీబీడీటీ ఇన్వెస్టిగేషన్, ఆడిట్ అండ్ జుడీషియల్ విభాగాల్లో సభ్యుడిగా ఉన్నారు. కేవీ చౌదరి దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిన్నమనేని కోటేశ్వరరావు అల్లుడు. -
ఎల్వోపీ లేకుండానే కీలక భర్తీలు
ప్రతిపక్ష నేత లేకుండా చట్టబద్ధ సంస్థల్లో పదవుల భర్తీకి కేంద్రం నిర్ణయం లోక్‌సభ సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్న డీవోపీటీ న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎంపిక కమిటీలో ప్రధాన ప్రతిపక్ష నేత (ఎల్వోపీ) లేకుండానే చట్టబద్ధమైన కేంద్ర విజిలెన్స్ కమిషనర్, జాతీయ మానవహక్కుల సంఘం చైర్మన్, లోక్‌పాల్ తదితర పదవులను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. లోక్‌సభ సెక్రటేరియట్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు చెప్పాయి. సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఎల్‌వోపీపై సమాచారమివ్వాల్సిందిగా లోక్‌సభకు లేఖ రాసింది. దానిపై స్పందించిన లోక్‌సభ సెక్రటేరియట్.. గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేత ఎవరూ లేరంటూ సమాచారమిచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో చట్టబద్ధ సంస్థల నియామకాలపై ఎల్వోపీ లేకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆ వర్గాలు చెప్పాయి. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 55 సీట్లు ఉండాలి. అయితే కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లు మాత్రమే ఉండటంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించడం తెలిసిందే. లోక్‌పాల్, ఎన్హెచ్ఆర్సీ, సీవీసీల నియామకాల ఎంపిక కమిటీలో ఎల్వోపీ ఉండటం తప్పనిసరి కాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. 2003 కేంద్ర నిఘా చట్టం ప్రకారం సీవీసీ, విజిలెన్స్ కమిషనర్లను ప్రధానమంత్రి నేతృత్వంలో హోం మంత్రి, ఎల్వోపీతో కూడిన ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ చేసిన సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఎల్వోపీని గుర్తించకపోతే లోక్‌సభ ప్రతిపక్ష పార్టీల్లోని పెద్ద పార్టీ నేతను ఆ కమిటీలోకి తీసుకోవచ్చని ఆ చట్టంలో మరో నిబంధన చెబుతోంది. అంతేగాక కమిటీలో ఏదైనా ఖాళీ ఉన్నంత మాత్రాన ఆ నియామకం చెల్లుబాటుకాకుండాపోదని ఆ చట్టం పేర్కొంటోంది. ఇదే విధంగా లోక్‌పాల్, ఎన్హెచ్ఆర్సీ చట్టాలు కూడా చెబుతున్నాయి. 2005 ఆర్టీఐ చట్టం ప్రకారమైతే.. ఎల్వోపీని గుర్తించని పక్షంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేతను అలా భావించాలని పేర్కొంటోంది. కాగా, ప్రతిపక్ష నేత లేకపోవడంతో సీఐసీ చీఫ్ నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేదు. 2005లో అది ప్రారంభమైన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. సీఐసీ రాజీవ్ మాధుర్ గత నెల 22న పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. -
మంత్రుల అనుమతితోనే దరఖాస్తు
సీవీసీ, విజిలెన్స్ కమిషనర్ పోస్టులపై కేంద్రం న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ), విజిలెన్స్ కమిషనర్(వీసీ) పదవులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఐఏఎస్ అధికారులు పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రప్రభుత్వ శాఖలో కార్యదర్శి లేదా సమాన హోదాలో పనిచేస్తున్నవారు సంబంధిత మంత్రి అనుమతితో, సంబంధిత శాఖ ద్వారానే ‘డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)’కు దరఖాస్తు పంపించాలని స్పష్టంచేసింది. కార్యదర్శి లేదా సమానహోదాలో పదవీవిరమణ చేసిన ఐఏఎస్ అధికారులు, గతంలో కేంద్ర శాఖల్లో కార్యదర్శి లేదా సమానహోదాలో పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల్లో విధుల్లో ఉన్నవారు నిబంధనలకు తగ్గట్టు దరఖాస్తులను డీఓపీటీకి పంపించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సీవీసీ, వీసీ పదవుల్లో నియమించేందుకు నిజాయతీపరులైన అధికారుల పేర్లను సూచించాల్సిందిగా కేబినెట్ కార్యదర్శికి, కేంద్రంలోని అన్ని శాఖల కార్యదర్శులకు డీఓపీటీ లేఖలు రాసింది. ప్రదీప్ కుమా ర్ సీవీసీగా ఈ సెప్టెంబర్ 28న, జేఎం గార్గ్ వీసీగా సెప్టెంబర్ 7న రిటైర్ కానున్నారు. -
సీవీసీ నియామక ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత అంశంపై స్పీకర్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అరుునప్పటికీ కేంద్రం సోమవారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) నియూమక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నామినేషన్లు కోరింది. నిజారుుతీగా, నిష్పాక్షికంగా వ్యవహరించే, ఈ పోస్టుకు పరిశీలించదగిన వారి పేర్లను సూచించాల్సిందిగా కోరుతూ కేబినెట్ కార్యదర్శితో పాటు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) లేఖ రాసింది. సీవీసీతో పాటు సీవీసీ కార్యాలయంలో విజిలెన్స్ కమిషనర్ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. నిబంధనల ప్రకారం.. ప్రధాని నేతృత్వంలోని హోం మంత్రి, ప్రతిపక్ష నేతలతో కూడిన త్రిసభ్య సెలెక్షన్ కమిటీ సిఫారసు ఆధారంగా రాష్ట్రపతి సీవీసీ, వీసీల నియూమకం చేపడతారు. ప్రతిపక్ష నేత ఖరారుకాని పక్షంలో ఏకైక అతిపెద్ద పార్టీ నేత.. ప్రతిపక్ష నేతగా ఉంటారని డీవోపీటీ కార్యదర్శి ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు రాసిన లేఖలోని మార్గదర్శకాలు పేర్కొన్నారుు.