ఎల్‌వోపీ లేకుండానే కీలక భర్తీలు | Leader of the Opposition in the legal institutions of the filling down the center of the decision | Sakshi
Sakshi News home page

ఎల్‌వోపీ లేకుండానే కీలక భర్తీలు

Published Mon, Sep 8 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

Leader of the Opposition in the legal institutions of the filling down the center of the decision

ప్రతిపక్ష నేత లేకుండా చట్టబద్ధ సంస్థల్లో పదవుల భర్తీకి కేంద్రం నిర్ణయం
లోక్‌సభ సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్న డీవోపీటీ

 
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎంపిక కమిటీలో ప్రధాన ప్రతిపక్ష నేత (ఎల్‌వోపీ) లేకుండానే చట్టబద్ధమైన కేంద్ర విజిలెన్స్ కమిషనర్, జాతీయ మానవహక్కుల సంఘం చైర్మన్, లోక్‌పాల్ తదితర పదవులను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. లోక్‌సభ సెక్రటేరియట్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు చెప్పాయి. సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఎల్‌వోపీపై సమాచారమివ్వాల్సిందిగా లోక్‌సభకు లేఖ రాసింది. దానిపై స్పందించిన లోక్‌సభ సెక్రటేరియట్.. గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేత ఎవరూ లేరంటూ సమాచారమిచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో చట్టబద్ధ సంస్థల నియామకాలపై ఎల్‌వోపీ లేకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆ వర్గాలు చెప్పాయి. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 55 సీట్లు ఉండాలి. అయితే కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లు మాత్రమే ఉండటంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించడం తెలిసిందే. లోక్‌పాల్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, సీవీసీల నియామకాల ఎంపిక కమిటీలో ఎల్‌వోపీ ఉండటం తప్పనిసరి కాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. 2003 కేంద్ర నిఘా చట్టం ప్రకారం సీవీసీ, విజిలెన్స్ కమిషనర్‌లను ప్రధానమంత్రి నేతృత్వంలో హోం మంత్రి, ఎల్‌వోపీతో కూడిన ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ చేసిన సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు.

ఎల్‌వోపీని గుర్తించకపోతే లోక్‌సభ ప్రతిపక్ష పార్టీల్లోని పెద్ద పార్టీ నేతను ఆ కమిటీలోకి తీసుకోవచ్చని ఆ చట్టంలో మరో నిబంధన చెబుతోంది. అంతేగాక కమిటీలో ఏదైనా ఖాళీ ఉన్నంత మాత్రాన ఆ నియామకం చెల్లుబాటుకాకుండాపోదని ఆ చట్టం పేర్కొంటోంది. ఇదే విధంగా లోక్‌పాల్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ చట్టాలు కూడా చెబుతున్నాయి. 2005 ఆర్టీఐ చట్టం ప్రకారమైతే.. ఎల్‌వోపీని గుర్తించని పక్షంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేతను అలా భావించాలని పేర్కొంటోంది. కాగా, ప్రతిపక్ష నేత లేకపోవడంతో సీఐసీ చీఫ్ నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేదు. 2005లో అది ప్రారంభమైన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. సీఐసీ రాజీవ్ మాధుర్ గత నెల 22న పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement