పాట్నా : సాటి మనిషికి కష్టమొస్తే.. అండగా నిలిచి మానవత్వం చూపాల్సిన వాళ్లే రాబందుల కన్నా హీనంగా వ్యవహరించారు. రాబందులన్నా.. కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ రాబందులు బతికున్న వాళ్లను పీక్కుతింటున్నారు. అనాథలైన పిల్లలకు తలో చేయ్యేసి మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన తరుణంలో వీరు తలో చేయ్యేసి వారి సొమ్మును కాజేసి వాటాలు పంచుకున్నారు.
బిహార్ అరియా జిల్లాలో బిష్ణుపుర గ్రామపంచాయితీకి చెందిన ముగ్గురు చిన్నారులు సోని(18) నితీష్ (14 ), చాందిని (12)లు నాలుగు రోజుల వ్యవధిలో తల్లితండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు. అనారోగ్యంతో తండ్రి బిరేంద్ర సింగ్, కరోనాతో తల్లి ప్రియాంక దేవి మరణిస్తే అంత్యక్రియల్ని నిర్వహించేందుకు 18ఏళ్ల కుమార్తె గ్రామస్తుల సాయం కోరింది. ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ బాలిక తల్లి మృతదేహాన్ని తన ఇంటి సరిహద్దుల్లోనే అంత్యక్రియలు నిర్వహించింది. కానీ తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం నిర్వహించిన దశదిన కర్మకు భోజనం చేసేందుకు 150 మంది గ్రామస్తులు వచ్చారు. భోజనం చేసిన అనంతరం తల్లిదండ్రులకు ట్రీట్మెంట్ కు తాము ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అందినకాడికి అభంశుభం తెలియని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి వాటాలు పంచుకోవడం పలువురిని కంటతడిపెట్టిస్తోంది.
ఈ సందర్భంగా పెద్దకుమార్తె సోని మాట్లాడుతూ.. ‘నా తండ్రి అనారోగ్యంతో మరణించారు. తల్లి కరోనాతో మరణించింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తుల్ని సాయం కోరితే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ దశదిన కర్మకు 150 మంది గ్రామస్తులు వచ్చారు. ఇంతమంది వస్తారని ఊహించలేదు. వచ్చిన వాళ్లు తండ్రి ట్రీట్మెంట్‌కు డబ్బులు ఇచ్చామని, ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని మాపై ఒత్తిడి తెచ్చారంటూ’ ఆ బాలిక కన్నీటి పర్యంతరమైంది.
Comments
Please login to add a commentAdd a comment