
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని బిజ్‌రోల్ గ్రామంలో ఒక వీధికుక్క మృతి చెందిన నేపధ్యంలో దానికి గ్రామస్తులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. దాని ఆత్మశాంతి కోసం శాంతిహోమం నిర్వహించారు. అది మృతిచెందిన 13వ రోజున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. గ్రామస్తులంతా ఒక చోట చేరి, ఆ కుక్కకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతూ ప్రార్థనలు కూడా చేశారు.
వివరాల్లోకి వెళితే బాగపత్‌లోని బిజ్‌రోల్ గ్రామంలో ఉంటున్న వీధి కుక్క టామీ ఉరఫ్ మున్నా అక్కడి అన్ని గల్లీలోనూ తిరిగేది. ఆ కుక్కను గ్రామస్తులంతా ఎంతో ప్రేమగా చూసేవారు. అది గ్రామస్తులందరికీ ఎంతో దగ్గరయ్యింది. అయితే అది ఆగస్టు 6న తన 12 ఏళ్ల వయసులో మృతి చెందింది. దీంతో గ్రామస్తులంతా ఎంతో బాధపడ్డారు. దాని ఆత్మ శాంతించాలని పలురకాల కార్యక్రమాలు నిర్వహించారు. 13వ రోజున సామూహక అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.
గ్రామానికి చెందిన శ్రవణ్ సింగ్ మాట్లాడుతూ టామీ అంటే గ్రామంలోని అందరికీ ఎంతో ఇష్టమని, దాని గుణాలు తమను ఎంతో ఆకట్టుకునేవని అన్నారు. ఆ కుక్క మృతిచెందిన 13వ రోజున 500 మందికి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. కుసుమ అనే గృహిణి మాట్లాడుతూ టామీని తాము తమ పిల్లగా చూసుకునేవారమని, అది ఎంతో తెలివైనదని అన్నారు. అది ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేది కాదన్నారు.
ఇది కూడా చదవండి: భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్లు.. గుండె గుభేల్‌మనిపిస్తున్న వీడియో..!
Comments
Please login to add a commentAdd a comment