కొచ్చి: జీవితంలో ప్రతీఒక్కరికీ ఓ కల ఉంటుంది. అయితే కొందరు పరిస్థితుల ప్రభావాల వల్ల మధ్యలోనే వదిలేస్తుంటే మరికొందరు అనుకున్నది ఎలాగైనా సాధిస్తున్నారు. అచ్చం ఇలానే ఓ వృద్ధ జంట ప్రపంచాన్ని చేట్టేయాలని కలలు కన్నారు. వాటిని ఇప్పడు నిజం చేసుకుంటున్నారు. ఇందులో ఏముంది ధనవంతులు అనుకుంటే ఇలాంటివి ఈజీనే అంటారా! అలా అనుకుంటే పొరపాటే.. ఆ దంపతులు టీ కొట్టు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అలా సంపాదించిన డబ్బులతోను వాళ్లు తమ విదేశి యాత్రలను స్టార్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన వృద్ధ జంట కె.ఆర్. విజయన్, ఆయన భార్య టీ కొట్టుతో జీవనం సాగిస్తుంటారు. ప్రపంచాన్ని చుట్టేయాలన్నది వారి చిరకాల స్వప్నం. అయితే వారికి చిన్న టీ కొట్టు మాత్రమే ఆదాయ మార్గం. ఉన్నదాంతోనే వారు తమ కలలను నిజం చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లే వారు ఇప్పటికే 25 దేశాలను చుట్టేయగా, తరువాత 26వ దేశానికి కూడా వెళ్లనున్నారు. వీరికి పెద్దగా ఇంగ్లిష్ మాట్లాడటం రాదు కాబట్టి ట్రావెల్ ఏజెన్సీల సాయం తీసుకొని వీరు తమ ప్రయాణాలు ఖరారు చేస్తుంటారు.
యాత్ర ఇలా ప్రారంభమైంది
కాఫీ షాపు నుంచి రోజు దాచిపెట్టిన డబ్బులు ద్వారా ఈ జంట 2007లో మొదటి సారిగా వారి విదేశీ పర్యటనను ఇజ్రాయల్‌తో మొదలుపెట్టింది. వీరి స్ఫూర్తిదాయక యాత్ర గురించి తెలియడంతో మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ అనంద్ మహింద్ర ఆ వృద్ధ జంటకు ఒక పర్యటనను స్పాన్సర్ కూడా చేసేందుకు ముందుకొచ్చారు. 2019లో.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సందర్శించారు. అదే వారు చేపట్టిన చివరి విదేశీ పర్యటన. ఎందుకంటే ఆ తర్వాత మహమ్మారి కారణంగా వారి ప్రపంచ యాత్రలకు బ్రేక్ పడింది. విదేశీ పర్యటనల కోసం ఈ జంట తమ ఆదాయం నుంచి ప్రతీ రోజు రూ.300 దాచిపెట్టేవారు.
పర్యటనల కోసం కొన్న సార్లు వీరు అప్పులు చేసి తిరిగి వచ్చాక వాటిని తీర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే కరోనా నుంచి ప్రపంచం క్రమంగా బయటకు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ జంట మరోసారి విదేశీ యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వారు రష్యా వెళ్లనున్నారు. ఎలాగూ అంత దూరం వెళ్తున్నాం కదా కుదిరితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవాలనుకుంటోంది ఈ వృద్ధ జంట. అక్టోబర్ 21న ప్రారంభమయ్యే వీరి యాత్ర అక్టోబర్ 28న ముగియనుంది.
చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే..
Comments
Please login to add a commentAdd a comment