చండీగఢ్: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత జనాలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. బయట ఆహారాన్ని తగ్గించి.. ఇంటి భోజనానికే పెద్ద పీట వేస్తున్నారు. ఇక రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం రకరకాల జ్యూస్‌లు, కషాయాలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. దీనిలో ఓ వ్యక్తి ‘ఖూనీ జ్యూస్’ తయారు చేస్తున్నాడు.
ఖూనీ అంటే చంపేయడం.. అంటే ఎవరినైనా చంపి.. వారి రక్తంతో జ్యూస్ తయారు చేస్తున్నాడా ఏంటి అనే అనుమానం కలగకమానదు. ఇక పేరుకు తగ్గట్లే ఆ జ్యూస్ కూడా ఎర్రగా రక్తం రంగులో ఉంటుంది. చూడగానే.. ముఖం ఏదోలా పెట్టినా.. తయారీ విధానం చూశాకా లొట్టలేసుకుంటూ మరీ ఖూనీ జ్యూస్‌ని తాగుతున్నారు. మరి ఆ జ్యూస్ తయారీ.. పేరు వెనక కారణాలు తెలియాలంటే ఇది చదవండి..
హరియాణాకు చెందిన చిరు వ్యాపారి నదీమ్ ఫరిదాబాద్‌లోని భగత్‌సింగ్ చౌక్‌లో చిన్న జ్యూస్ సెంటర్ నడుపుతున్నాడు. కరోనా కాలంలో జనాలు బయట ఆహారం అంటే భయపడుతుండటంతో.. నదీమ్ తన రూట్ మార్చాడు. జనాల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ.. ‘ఖూనీ జ్యూస్’ తయారీ ప్రారంభించాడు. ఇక ఈ జ్యూస్ తయారు చేయడానికి నదీమ్ పలు రకాల పండ్లు, కూరగాయాలు వాడాడు.
ముఖ్యంగా పాలకూర, కాకరకాయ, పసుపు, క్యారెట్, బీట్‌రూట్, ఆరెంజ్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలు వాడి జ్యూస్ తయారు చేశాడు. బీట్‌రూట్ వాడటంతో ఇది ఎర్రగా ఉంటుంది. దాంతో దీనికి వెరైటీగా ఉంటుందని భావించి ‘ఖూనీ జ్యూస్’ అని పేరు పెట్టాడు నదీమ్. సర్వ్ చేయడానకి ముందు నిమ్మరసం, నల్ల ఉప్పు వేసి కస్టమర్లకు అందిస్తాడు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాక రుచిగా ఉండటంతో జనాలు ‘ఖూనీ జ్యూస్’ కోసం క్యూ కడుతున్నారట. ప్రస్తుతం నదీమ్ జ్యూస్ తయారు చేసే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజనులు నదీమ్ తెలివితేటలను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న దేశీ చిరు వ్యాపారులను ప్రోతాహించాల్సిన అవసరం ఎంతో ఉంది. జ్యూస్ చూడ్డానికే కాదు.. తాగడానికి కూడా ఎంతో బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment