ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లోని ఇగత్‌పురి ప్రాంతంలో ఓ గుడిసెలో ఆడ చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. మంగళవారం భూమ్మీద పడ్డ ఈ పసికూనలు ఆరోగ్యంగా ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు అప్పుడే కళ్లు తెరిచి ఈ లోకాన్ని చూస్తున్న చిరుత పులి కూనలు అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. తల్లి మాత్రం అక్కడే ఓ మూలన కూర్చుని ఉంది. పిల్లలు గుడిసంతా కలియదిరుగుతూ పిల్లిపిల్లలా శబ్ధాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (రైల్వే ట్రాక్‌పై చిరుత మృతదేహం)
'పులి పిల్లలే కానీ పిల్లిలా కన్పిస్తున్నాయి', 'ఎంత ముద్దొస్తున్నాయో..', 'మీ కుటుంబం అద్భుతంగా ఉంది' అంటూ నెటిజన్లు వారి స్పందనలను తెలియజేస్తున్నారు. 51 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. మరోవైపు వాటిని ఉన్నఫళంగా అక్కడి నుంచి పంపించివేయడానికి అటవీ అధికారులకు మనసొప్పలేదు. దీంతో తల్లే వాటిని వేరే చోటుకు తీసుకు వెళ్లే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఇగత్‌పురి ప్రాంతంలో పెద్ద సంఖ్యలోనే పులులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారి గణేశ్ రావు జోలె పేర్కొన్నారు. (చిరుత కోసం రిస్క్, ‘రియల్ హీరో’పై ప్రశంసలు)
Comments
Please login to add a commentAdd a comment