
న్యూఢిల్లీ: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, ఈ వేడుకలలో ఏదో ఒక ట్విస్ట్ జరిగి ఆ వివాహం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. తాజాగా, ఈ పెళ్లి కూడా ఒక వెరైటీ సంఘటనతో వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ వివాహంలో మండపాన్ని పూలమాలలతో అందంగా అలంకరించారు. బంధువుల మధ్య సిందూర్ అనే కార్యక్రమం ప్రారంభమైంది.
సాధారణంగా, ఈ వేడుకలో వరుడు, వధువు నుదుట.. తల కొప్పులో కుంకుమ పెట్టడం ఆచారం. అయితే, వధువు వేదిక మీద కూర్చోని ఉంది. ఈ క్రమంలో వరుడు, పెళ్లికూతురికి బొట్టు పెట్టడానికి వేదిక దగ్గరకు చేరుకున్నాడు. కుంకుమ పెట్టాడానికి సిద్ధమయ్యాడు.. అయితే, ఇంతలోనే వధువు ఒక్కసారిగా కిందపడి పోయింది. దీంతో వరుడు షాక్ గురయ్యాడు. పాపం.. అతనికి ఏంజరిగిందో అర్థం కాలేదు. కాసేపటికి, వధువు ప్రవర్తన పట్ల అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన అతను.. వెంటనే తన తలపాగను తీసిపాడేశాడు. అంతటితో ఆగకుండా కోపంతో.. మెడలోని పూలమాల తీసి నెలకేసి కొట్టాడు.
ఈ క్రమంలో వరుడిని ఆపటానికి బంధువులు ప్రయత్నించారు. అయినా.. వరుడు ఎవరిమాట లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. వధువుకి ఏమయ్యిందో..’, ‘ఆ యువతికి పెళ్లి ఇష్టంలేదు కాబోలు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment