పశ్చిమ బెంగాల్‌లో నేడు(బుధవారం) జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. హిందూ జాగరణ్ మంచ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సుమారు ఐదువేల శోభాయాత్రలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కోల్‌కతాలోని బరాసత్, సిలిగురి బరాబజార్‌లలో కూడా భారీ ఊరేగింపులు నిర్వహించే సన్నాహాల్లో ఉంది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం గతంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు హూగ్లీ, హౌరా, ఉత్తర,దక్షిణ దినాజ్‌పూర్, అసన్‌సోల్, బరాక్‌పూర్‌లలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా శాంతిభద్రతలను ఉల్లంఘించినట్లు కనిపిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఒక ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ నేటి ఊరేగింపులో ఆయుధాల బహిరంగ ప్రదర్శనకు అనుమతించబోమని, ఊరేగింపులను వీడియోగ్రాఫ్ చేయనున్నామన్నారు.
గత ఏడాది మార్చి 30న హౌరాలో జరిగిన శోభాయాత్రలో పరిస్థితి అదుపు తప్పింది. ఆ తర్వాత జరిగిన హింసాకాండ రెండు జిల్లాలకు వ్యాపించింది. పలు ఘటనల్లో పది మంది గాయపడ్డారు. తాజాగా కలకత్తా హైకోర్టు .. విశ్వహిందూ పరిషత్, అంజనీ పుత్ర సేనకు కొన్ని షరతులు విధిస్తూ హౌరాలో రామనవమి శోభా యాత్రను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది.
నేడు (బుధవారం) జరిగే శ్రీరామనవమి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని హిందూ జాగరణ్ మంచ్ తెలిపింది. హిందూ జాగరణ్ మంచ్ సభ్యుడు సుభాజిత్ రాయ్ మంచ్ మీడియాతో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment