2023 ముగిసింది. 2024 నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. అందరూ తమ ఆశలు, అంచనాలతో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారు. 2023లో వార్తల్లో కనిపించిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్ కూడా కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించారు.
2023 తనకు ఎంతో మంచి చేసిందని సీమా హైదర్ మీడియాకు తెలిపారు. 2024లో తన సమస్యలన్నీ తొలగిపోతాయని, కుటుంబంతో కలిసి భారతదేశంలో స్వేచ్ఛగా జీవితాన్ని గడిపే అవకాశం దక్కుతుందని ఆశ పడుతున్నానని ఆమె పేర్కొన్నారు.
మే 2023లో నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో సహా యూపీ చేరుకున్న సీమా హైదర్ ప్రస్తుతం రబుపురా గ్రామంలోని తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లో ఉంటున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలనే నిబంధన ఉందని, అందుకే ఇంటిలోనే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నానని సీమా తెలిపారు.
తనకు బయటకు వెళ్లే అవకాశం దొరికినప్పుడు దేశమంతా పర్యటించాలని కోరుకుంటున్నానని, తన భర్త, పిల్లలు ఇంటి బయట నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. అయితే తన నలుగురు పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ దొరకని పరిస్థితి ఉందని, అందుకే వారు ట్యూషన్‌కు వెళుతున్నారని ఆమె తెలిపారు. అయితే 2024లో తన పిల్లలను బడికి పంపించే అవకాశం దక్కుతుందనుకుంటున్నానని సీమ పేర్కొన్నారు.
పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ తన పిల్లలతో కలిసి 2023, మే 13న నేపాల్ మీదుగా భారత్‌కు తరలివచ్చారు. తరువాత రబుపురా గ్రామం చేరుకుని తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లో ఉంటున్నారు. కాగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమాపై గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను, సచిన్, సచిన్ తండ్రిని అరెస్ట్ చేశారు. ముగ్గురినీ గత జూలై 4న అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురికీ బెయిల్ మంజూరైంది.
ఇది కూడా చదవండి: వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు
Comments
Please login to add a commentAdd a comment