భారత్‌-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు? | Sakshi
Sakshi News home page

భారత్‌-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు?

Published Sun, Aug 27 2023 11:04 AM

What is The Story of Kachchatheevu Island - Sakshi

ఆమధ్య  ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో మన దేశానికి దక్షిణాన ఉన్న కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించారు. భారత్‌- శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉన్న ఈ ద్వీపం గత కొన్నేళ్లుగా భారతదేశంలో చర్చనీయాంశంగా ఉంది. ఈ ద్వీపం గురించి ప్రధాని మాట్లాడుతూ 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కచ్చతీవును శ్రీలంకకు కానుకగా ఇచ్చారని, అయితే ఈ ద్వీపం భారత్‌లో భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

రామేశ్వరంనకు 12 మైళ్ల దూరంలో..
కచ్చతీవు ద్వీపం భారతదేశంలోని రామేశ్వరం- శ్రీలంక ప్రధాన భూభాగం మధ్య పాక్ జలసంధిలో ఉన్న జనావాసాలు లేని ఒక ద్వీపం. ఇక్కడ చుక్క నీరు కూడా దొరకదు. ఈ ద్వీపం బంగాళాఖాతం- అరేబియా సముద్రాలను కలుపుతుంది. కచ్చతీవు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం నుండి 12 మైళ్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాలోని నెందురికి 10.5 మైళ్ల దూరంలో ఉంది. 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం 300 మీటర్ల వెడల్పు కలిగివుంది.
ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది?

14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం 
ఈ ద్వీపంలో మత్స్యకారుల ఆరాధనా స్థలం సెయింట్ ఆంథోనీ చర్చి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఈ చర్చిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ ఉత్సవాలలో భారత్‌, శ్రీలంకకు చెందిన మత్స్యకారులు పాల్గొంటారు. ఇక్కడి పగడపు దిబ్బల కారణంగా భారీ ఓడలు ఈ ప్రాంతంలో ప్రయాణించలేవు. 14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత ఈ ద్వీపం ఏర్పడిందని చెబుతారు. ఈ ద్వీపానికి సంబంధించి భారత్, శ్రీలంకల మధ్య  ఎంతో కాలంగా వివాదం నడుస్తోంది. బ్రిటిష్ పాలనా కాలంలో భారత్‌, శ్రీలంకకు చెందిన మత్స్యకారులు ఈ ద్వీపంలో చేపలు పట్టేవారు. ఈ ద్వీపం రామనాథపురం రాజు ఆధీనంలో ఉండేది. తరువాత భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగినప్పుడు ఇది మద్రాసు ప్రెసిడెన్సీలోకి  చేరింది.

1974-76లో ఇరు దేశాల మధ్య ఒప్పందం
1921లో ఈ ద్వీపానికి సంబంధించి శ్రీలంక, భారత్‌ల మధ్య ఒప్పందం జరిగినా ఫలితం లేకపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ దీవి గుర్తింపు విషయంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 1970వ దశకంలో, భారతదేశం- శ్రీలంక మధ్య సముద్ర సరిహద్దు నిర్ధారణపై చర్చలు ప్రారంభమైనప్పుడు, 1974-76లో ఇరు దేశాల మధ్య తుది ఒప్పందం కుదిరింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ భారత ప్రధానిగా, శ్రీమావో బండారునాయకే శ్రీలంక అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఒప్పందం ప్రకారం కచ్చతీవు ద్వీపం శ్రీలంకకు చెందుతుంది.

నాటి ఒప్పందం ప్రకారం భారతీయ మత్స్యకారులు వీసా లేకుండా ఈ ద్వీపంలో విశ్రాంతి తీసుకోవడానికి, వలలు ఆరబెట్టడానికి, సెయింట్ ఆంథోనీ పండుగను జరుపుకోవడానికి అనుమతి ఉంది. అయితే 2010లో ఎల్‌టీటీఈ తిరుగుబాటు ముగిసిన తరువాత శ్రీలంక మత్స్యకారులు ఈ ప్రాంతంలో చేపలు పట్టడం ప్రారంభించారు. అయితే  శ్రీలంక నేవీ ఈ ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల రాకను నిలిపివేసింది. దీనిపై వివాదాలు తలెత్తేవి.

సుప్రీం కోర్టుకు చేరిన వివాదం
భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడంపై చాలాకాలంగా వ్యతిరేకత ఉంది. 1991లో తమిళనాడు శాసనసభలో ద్వీపాన్ని తిరిగి భారతదేశంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. 2008లో అప్పటి జయలలిత ప్రభుత్వం ఈ విషయమై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఇంకా పరిశీలనలో ఉంది. తమిళనాడు డిఎంకె, ఐడిఎంకె పార్టీలు ఈ అంశాన్ని తరచుగా లేవనెత్తుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ కూడా లోక్‌సభలో కచ్చతీవును అంశాన్ని ప్రస్తావించారు. ఈ ద్వీపానికి సంబంధించి ఇందిరా గాంధీ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా ఉల్లంఘిస్తే, శ్రీలంక భారత్‌ను అంతర్జాతీయ కోర్టుకు లాగుతుందనే వాదన వినిస్తున్నది. కచ్చతీవు విషయంలో ప్రధాని మోదీ ఎలాంటి వైఖరిని అవలంబిస్తారో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement