New Covid Variant Mumbai: Maharashtra Reports Mumbai XE Case Centre Disagrees - Sakshi
Sakshi News home page

ముంబై కొత్త వేరియెంట్‌ XE కేసుపై సందిగ్ధం!.. ఇంకా నిర్ధారణే కాలేదా?

Published Thu, Apr 7 2022 7:48 AM | Last Updated on Thu, Apr 7 2022 8:29 AM

While Maharasthra Reports Mumbai XE Case Centre Disagrees - Sakshi

Mumbai XE Variant Case: ముంబై(మహారాష్ట్ర)లో ఒమిక్రాన్‌ మ్యూటేషన్‌​ కొత్త వేరియెంట్‌ ఎక్స్‌ఈ(XE) కేసు వెలుగు చూసిందంటూ వార్తలు హోరెత్తిన విషయం తెలిసిందే. నెల కిందట సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఫ్యాషన్‌ డిజైనర్‌(50)కు చెందిన శాంపిల్స్‌లో వేరియెంట్‌ ఆనవాలు గుర్తించినట్లు బీఎంసీ(బృహ‌ణ్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్) బుధవారం ప్రకటించుకుంది. అయితే.. ఈ విషయంలో ముంబై అధికారులు తొందరపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది. 

కరోనా వైరస్‌లో ఇప్పటిదాకా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ను వేగంగా వ్యాపించేదిగా గుర్తించారు వైద్యులు. ఒమిక్రాన్‌లో బీఏ.2 ఉపవేరియెంట్‌ వ్యాప్తి ఇంకా వేగంగా ఉండేదని అనుకున్నారు. అయితే ఇంతకంటే పది రెట్లు ఎక్స్‌ఈ వేరియెంట్‌ వ్యాపించే గుణం ఉందని, అయినా అంతప్రమాదకరమైంది కాదని, కేసులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా మాత్రం ఉండాలంటూ.. వైద్య నిపుణులు దానిని గుర్తించినప్పుడే హెచ్చరించారు. తాజాగా దేశంలోనే తొలి ఎక్స్‌ఈ కేసుగా బీఎంసీ ప్రకటించుకుంది. గ్లోబల్‌ జెనోమిక్‌ డాటా ప్రకారం.. అది ఎక్స్‌ఈ అని తేల్చేసింది కూడా. కానీ..  

కేంద్ర ఆరోగ్య సంస్థ ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 జెనోమిక్స్‌ కాన్సోర్టియమ్‌ మాత్రం అది ఎక్స్‌ఈ కేసు కాదని కొట్టిపారేసింది. బీఎంసీ అభ్యర్థన నేపథ్యంలో.. మరో దఫా ఆ శాంపిల్స్‌ను పరిశీలించాలని భావిస్తోంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జెనోమిక్స్‌కు శాంపిల్స్‌ను పంపించింది. ఫలితాలు రావాల్సి ఉంది.  అయితే ఈలోపే ముంబైలో తొలి ‘ఎక్స్‌ఈ’ కేసు నమోదు అయ్యిందని ప్రకటించడాన్ని కేంద్ర ఆరోగ్య సంస్థలు తప్పుబడుతున్నాయి. అది ఎక్స్‌ఈ కేసుగా ఇంకా ధృవీకరణ కాలేదని కేంద్ర ఆరోగ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. 

కేంద్రం సూచనల మేరకు.. బీఎంసీ అధికారులు సైతం నివేదికలు వచ్చేదాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ‘‘తొలుత మేం ఆ శాంపిల్‌ను ఎక్స్‌ఈ కేసుగానే భావించాం. కానీ,  జీనోమిక్‌ పిక్చర్‌తో అది సరిపోలకపోవడంతో ఎందుకైనా మంచిదని మరోసారి టెస్టులకు పంపించాం’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు ఈ పాటికే దాని ప్రభావం చూపాల్సి ఉందని, ప్రస్తుతానికి భారత్‌లో ఎక్స్‌ఈ కేసులు నమోదు అయినట్లు తాము భావించడం లేదని ఆయన అంటున్నారు. 

యాభై ఏళ్ల వయసున్న సౌతాఫ్రికన్‌ మహిళ.. ఫిబ్రవరి 10వ తేదీన భారత్‌కు వచ్చారు. ఫిబ్రవరి 27న ఆమెకు కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను ఓ హోటల్‌ గదిలో క్వారంటైన్‌లో ఉంచారు. ఆపై శాంపిల్‌ను కస్తూర్బా ఆస్పత్రి లాబోరేటరీకి జీనోమ్‌సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. అందులో ఎక్స్‌ఈ వేరియెంట్‌గా నివేదిక రావడంతో ముంబై అధికారులు ప్రకటన చేశారు.

విశేషం ఏంటంటే.. ఆమెకు స్వల్పలక్షణాలే ఉండగా.. మరోసారి టెస్ట్‌ నిర్వహించినప్పుడు నెగెటివ్‌గా తేలిందంట. ఆ తర్వాత మరోసారి టెస్టులు నిర్వహించడంతో పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న ఆమె.. ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఎక్స్‌ఈ వేరియెంట్‌.. ఒమిక్రాన్‌ స్ట్రెయిన్‌లు బీఏ.1, బీఏ.2ల మ్యూటెంట్‌ వేరియెంట్‌. జనవరి 19న ఈ ఒమిక్రాన్‌ మ్యూటెంట్‌ వేరియెంట్‌ తొలి కేసును యూకేలో గుర్తించారు. ప్రస్తుతం అక్కడ కరోనా విజృంభణకు కారణం.. ఇదే.

సంబంధిత వార్త: కొత్త వేరియంట్‌ ఎక్స్‌ఈ.. లక్షణాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement