హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో సీఎంను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖును తొలగించి, సీనియర్ నేత ప్రతిభా సింగ్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత ప్రతిభా సింగ్ దివంగత నేత వీరభద్ర సింగ్ భార్య. వీరభద్ర సింగ్ ఆరుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిభా సింగ్ 1998 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. హిమాచల్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే నాడు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2004 లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2012లో ఆమె భర్త వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన లోక్‌సభకు రాజీనామా చేశారు. దీంతో 2013లో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో నిలిచి, బీజేపీ నేత జైరామ్ ఠాకూర్‌ను ఓడించారు.
2014లో లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వేవ్‌లో బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ 39 వేలకు పైగా ఓట్ల తేడాతో ప్రతిభా సింగ్‌పై విజయం సాధించారు. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రతిభా సింగ్ ఓటమితో నేతలంతా కంగుతిన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత 2021లో ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో విజయం సాధించారు. 2022, ఏప్రిల్ 26న, హైకమాండ్ ప్రతిభా సింగ్‌ను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ 32వ అధ్యక్షురాలిగా నియమించింది.
ప్రతిభా సింగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో 1956 జూన్ 16న జన్మించారు. ప్రతిభా సింగ్ వీరభద్ర సింగ్‌ను 1985లో వివాహం చేసుకున్నారు. ప్రతిభ అతనికి రెండవ భార్య. వీరభద్ర సింగ్ మొదటి భార్య కుమార్తె అభిలాషా కుమారి గుజరాత్‌లో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్‌ల కుమారుడు విక్రమాదిత్య సింగ్ సిమ్లా రూరల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment